‘పాత’ లెక్కపై కసరత్తు

6 Dec, 2017 03:05 IST|Sakshi

పాత జిల్లాల వారీగా టీచర్‌ పోస్టులు, రోస్టర్‌పై పరిశీలన

కార్యాచరణ మొదలుపెట్టిన విద్యా శాఖ, టీఎస్‌పీఎస్సీ

రెండు మూడు రోజుల్లో కొలిక్కి

ఆ తర్వాతే సవరణ నోటిఫికేషన్‌

పాత జిల్లాల డీఈవోలే అపాయింటింగ్‌ అథారిటీ?

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పాత పది జిల్లాల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాల వారీగా కాకుండా పాత పది జిల్లాల వారీగా పోస్టులను భర్తీ చేసేందుకు సోమవారం రాత్రే ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య.. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి లేఖ (లెటర్‌ నంబర్‌ 7126/ఎస్‌ఈ జనరల్‌1/ఎ12015, డేట్‌ 4–12–2017) రాశారు. అలాగే మెమో కూడా జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పాత 10 జిల్లాల ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు అందులో పేర్కొన్నారు. అక్టోబర్‌ 21వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌కు సవరణ చేయాలని సూచించారు. అభ్యర్థులు ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టుల భర్తీకి రాత పరీక్షలను 2018 ఫిబ్రవరిలో నిర్వహించాలని గతంలో నిర్ణయించిన విధంగానే ముందుకు సాగాలని తెలిపారు. పాఠశాల విద్యా శాఖ పాత పది జిల్లాల ప్రకారం పోస్టుల వివరాలను, జిల్లాల వారీగా, పోస్టుల వారీగా రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్‌ వివరాలను విద్యా శాఖ.. టీఎస్‌పీఎస్సీకి అందజేయాలని సూచించారు. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యా శాఖ.. పోస్టుల వారీగా వివరాలతోపాటు రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్‌ వివరాలను సోమవారం రాత్రి టీఎస్‌పీఎస్సీకి అందజేసింది. దీంతో తదుపరి కార్యాచరణపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. విద్యా శాఖ అధికారులతోపాటు టీఎస్‌పీఎస్సీ అధికారులు పది జిల్లాల వారీగా పోస్టులు, రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్‌ వివరాలపై పరిశీలనను మంగళవారం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కొనసాగుతోంది. రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యాక సవరణ నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉంది.

అపాయింటింగ్‌ అథారిటీపై సమాలోచనలు
ఉపాధ్యాయ పోస్టులు జిల్లా కేడర్‌వి కావడంతో సంబంధిత జిల్లా అధికారి అయిన డీఈవోనే సాధారణంగా అపాయింటింగ్‌ అథారిటీగా వ్యవహరిస్తారు. 31 జిల్లాల ప్రకారం భర్తీ చేస్తే ఆ విధానమే అమలు చేయాలని ముందుగా నిర్ణయించారు. తాజాగా పాత జిల్లాల ప్రకారం పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో భర్తీ అయ్యే టీచర్ల అపాయింటింగ్‌ అథారిటీ ఎవరనే దానిపై అధికారులు ఆలోచిస్తున్నారు. ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదని, పాత జిల్లాల ప్రకారం పోస్టులను భర్తీ చేస్తున్నందున పాత జిల్లాల డీఈవోలే అపాయింటింగ్‌ అథారిటీగా వ్యవహరిస్తారని న్యాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఈ విషయంలో విద్యా శాఖ జాగ్రత్తగా ముందుకు సాగుతోంది. ఇప్పుడే నియామకాలకు సంబంధించిన అంశంపై వివాదం ఎందుకన్న ధోరణితో ముందుకు వెళ్తోంది. పరీక్షలు పూర్తయి, నియామకాలు చేపట్టే నాటికి దానిపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం ప్రకటించవచ్చని భావిస్తోంది.

మార్పుల కోసం ఎడిట్‌ ఆప్షన్‌!
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొత్త జిల్లాల ప్రకారం దరఖాస్తు చేసుకుని ఉన్నందున.. వారు పాత జిల్లాల ప్రకారం మార్పు చేసుకునేలా దరఖాస్తుల్లో ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వాల్సి ఉంటుందని విద్యా శాఖ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తుల్లో నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన స్కూల్, ప్రాంతం, జిల్లా పేరు ఉంటుంది కనుక.. అవి ఏ జిల్లా పరిధిలోకి (పాత జిల్లాల్లో) వస్తే ఆ జిల్లాకు స్థానికునిగా పరిగణనలోకి తీసుకుంటే సరిపోతుందని కొందరు అధికారులు భావిస్తున్నారు. దీనిపైనా రెండు మూడు రోజుల్లో టీఎస్‌పీఎస్సీ నుంచి స్పష్టత రానుంది.

మరిన్ని వార్తలు