గురుకుల పోస్టుల భర్తీపై అయోమయం

28 Dec, 2018 02:41 IST|Sakshi

పాత పద్ధతా లేక జోన్లవారీ విభజన తర్వాతే భర్తీనా?

ప్రభుత్వాన్ని స్పష్టత కోరిన బోర్డు

ఆదేశాలు వచ్చాకే నోటిఫికేషన్లు  

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో ఉద్యోగాల భర్తీపై అయోమయం నెలకొంది. గురుకుల బోర్డు ఏర్పాటు సమయంలోనే ప్రభుత్వం పలు పోస్టులు మంజూరు చేసినా ఆ మేరకు పూర్తిస్థాయి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. దాదాపు 1,350 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉండగా కొత్త జోన్లు, మల్టీజోన్లు ఏర్పాటు కావడం, ఆ తర్వాత ప్రభుత్వం రద్దు కావడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో వాటి భర్తీపై గురుకుల నియామకాల బోర్డు అయోమయంలో పడింది.

కొత్త జోన్ల ప్రకారం భర్తీ చేయాలా లేక పాత జోన్ల ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేయాలా అనే విషయమై సందిగ్ధం నెలకొంది. దీంతో ప్రభుత్వాన్నే వివరణ కోరాలని భావించిన గురుకుల నియామకాల బోర్డు ఆ మేరకు పరిస్థితిని ప్రభుత్వానికి వివరించింది. కొత్తగా ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు కావడంతో ఆ మేరకు సైతం పోస్టులను విభజించుకుని ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే నోటిఫికేషన్లు ఇచ్చేందుకు బోర్డు యంత్రాగం కసరత్తు చేస్తోంది. 

మరిన్ని వార్తలు