గ్రూప్‌–2కు తొలగిన అడ్డంకులు

4 Jun, 2019 02:22 IST|Sakshi

సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేసిన హైకోర్టు 

వ్యక్తిగత వివరాల నమోదులోనే బబ్లింగ్‌

అభ్యర్థుల జవాబుల్లో బబ్లింగ్‌ కాదు

దీనివల్ల ప్రతిభపై ఎలాంటి ప్రభావం ఉండదు

నియామక ప్రక్రియ కొనసాగించొచ్చు 

సాక్షి, హైదరాబాద్‌ : గ్రూప్‌–2 రాత పరీక్షల్లో బబ్లింగ్, వైట్‌నర్‌ వాడకం వివాదంపై హైకోర్టు ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. రెండుసార్లు బబ్లింగ్‌కు పాల్పడిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోరాదన్న సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేసింది. బబ్లింగ్‌ జరిగింది వ్యక్తిగత వివరాల నమోదులో మాత్రమేనని, ప్రశ్నలకు అభ్యర్థులు ఎంచుకున్న జవాబులకు కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. దీనివల్ల ప్రతిభపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌–బీఎం విజయకుమార్‌ల మధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇక్కడ వర్తించదని ధర్మాసనం ఉదహరించింది. ఇన్విజిలేటర్లకు సరైన అవగాహన లేకపోవడం వల్లే అభ్యర్థులు రెండుసార్లు బబ్లింగ్‌కు పాల్పడ్డారన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వాదనతో ఏకీభవించింది. వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు జరిగిన కారణంగానే వైట్‌నర్‌ వినియోగించాల్సి వచ్చిందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నియమించిన సాంకేతిక కమిటీ, సబ్‌ కమిటీల సిఫార్సుల మేరకు నియామక ప్రక్రియను కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. 

కమిటీ ఏర్పాటులో పక్షపాతం లేదు...
టీఎస్‌పీఎస్సీ నియమించిన సాంకేతిక కమిటీలో టీఎస్‌పీఎస్సీ ప్రతినిధులు ఎవరూ లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కమిటీలో ఓయూ, జేఎన్‌టీయూ, నేషనల్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌కు చెందిన వారున్నారని గుర్తించాలని పేర్కొంది. ఈ కమిటీ ఏర్పాటులో ఏమాత్రం పక్షపాతం కనబడలేదని తేల్చింది. 

కమిటీతో సమస్య జటిలమైంది...
‘ఇన్విజిలేర్ల పొరపాటు కూడా ఉంది. వ్యక్తిగత వివరాల నమోదులో బబ్లింగ్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. సాంకేతిక కమిటీ సిఫార్సులకు లోబడి టీఎస్‌పీఎస్సీ సబ్‌ కమిటీ వేసింది. సాంకేతిక కమిటీ సూచనల్ని అమలు చేయాలని సబ్‌ కమిటీ సిఫార్సు చేసింది. ఈ కారణంగా టీఎస్‌పీఎస్సీ తీసుకున్న నిర్ణయం సమర్ధనీయమే. అయితే సింగిల్‌ జడ్జి... సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా సాంకేతిక వ్యవహారాలపై ముగ్గురు సీనియర్‌ న్యాయవాదులతో కమిటీని ఏర్పాటు చేయడం తగదు. పైగా న్యాయవాదుల కమిటీ సమస్యను మరింత జటిలం చేసింది. సింగిల్‌ జడ్జి నియమించిన న్యాయవాదుల కమిటీ కారణంగా రోగికి ఉన్న జబ్బు కంటే చికిత్స దారుణంగా మారినట్లు అయింది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు