ఉపాధ్యాయ దరఖాస్తుల గడువు పెంపు!

29 Nov, 2017 04:12 IST|Sakshi

డిసెంబర్‌ 15 వరకు పొడిగించనున్న టీఎస్‌పీఎస్సీ

అవసరమైతే మరింత పొడిగించే అవకాశం

వారంలో పాత జిల్లాల వారీగా పోస్టుల వివరాలు

సాక్షి, హైదరాబాద్‌ : ఉపాధ్యాయ పోస్టుల దరఖాస్తు గడువును డిసెంబర్‌ 15వ తేదీ వరకు పొడిగించేందుకు టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. గతంలో ఇచ్చిన గడువు ఈనెల 30వ తేదీతో ముగియనుంది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు 31 జిల్లాల వారీగా కాకుండా పాత 10 జిల్లాల వారీగా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అలాగే విద్యా శాఖ కూడా 31 జిల్లాలకు ఇచ్చిన 8,792 పోస్టులను పాత జిల్లాల వారీగా చేసి ఇవ్వాల్సి ఉంటుంది.

వాటితోపాటు పాత జిల్లాల వారీగా పోస్టుల రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్లను టీఎస్‌పీఎస్సీకి అందజేయాల్సి ఉంది. ఇందుకు కొంత సమయం పట్టనున్న నేపథ్యంలో దరఖాస్తుల గడువును వచ్చే నెల 15వ తేదీ వరకు పొడిగించాలని టీఎస్‌పీఎస్సీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఒకవేళ పాత జిల్లాల వారీగా పోస్టుల భర్తీకి సంబంధించిన జీవో జారీ, పోస్టులు, రోస్టర్‌ ఇవ్వడంలో ఆలస్యమైతే.. మరికొన్ని రోజులు గడువు పెంచే అవకాశం ఉంది. పాత జిల్లాల వారీగా పోస్టులను, ఆయా జిల్లాల్లో కేటగిరీ వారీగా రోస్టర్‌ పాయింట్లను సిద్ధం చేసి వారం రోజుల్లోగా టీఎస్‌పీఎస్సీకి అందజేస్తామని విద్యా శాఖ పేర్కొంది. ఇదే విషయాన్ని టీఎస్‌పీఎస్సీకి తెలియజేసినట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు.

ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం
ప్రభుత్వ ఉత్తర్వులు, విద్యా శాఖ నుంచి వివరాలు అందిన తర్వాత టీఎస్‌పీఎస్సీ తదుపరి కసరత్తును ప్రారంభించనుంది. ఈ పోస్టుల భర్తీ కోసం గత నెల 30వ తేదీ నుంచి స్వీకరించిన దరఖాస్తుల్లో అభ్యర్థుల స్థానికతను 31 జిల్లాల వారీగా తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. దీంతో వారు తమ గ్రామం కొత్త జిల్లాల్లో దేని కింద వస్తుందో వాటినే ఎంచుకున్నారు. ఇపుడు పాత జిల్లాల ప్రకారం పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నందున కొత్త జిల్లాల ప్రకారం స్థా«నికత చెల్లదు. అందుకే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చి పాత జిల్లాను తమ స్థానిక జిల్లాగా ఎంచుకునేందుకు టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టనుంది. అలాగే నోటిఫికేషన్‌కు సవరణలు చేయనుంది. ఇదివరకు ఇచ్చిన నోటిఫికేషన్‌లో 31 జిల్లాల వారీగా వివరాలు ఇవ్వగా, ఇపుడు పాత జిల్లాల ప్రకారం, కేటగిరీల వారీగా పోస్టులు, వాటి రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్లను వివరాలతో సవరణ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. మొత్తానికి ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టనుంది. అందుకే దరఖాస్తుల గడువును పెంచేందుకు ఏర్పాట్లు చేసింది.

మరిన్ని వార్తలు