‘ప్రిన్సిపాల్‌’ పోస్టుల పరీక్ష రద్దుపై వెనక్కి!

22 May, 2018 02:49 IST|Sakshi

‘బ్లాగ్‌’ ప్రశ్నలు తొలగింపు..మిగతా వాటితో వ్యాల్యుయేషన్‌

సుప్రీం’ గతంలో ఇచ్చిన తీర్పు మేరకు టీఎస్‌పీఎస్సీ నిర్ణయం

ప్రశ్నపత్రం రూపొందించిన అధికారిపై చర్యలకు సిఫారసు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలల్లోని 304 ప్రిన్సిపాల్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో ఓ ప్రైవేటు బ్లాగ్‌ నుంచి కాపీ చేసి ఇచ్చిన ప్రశ్నలను తొలగించి మిగతా ప్రశ్నలతో పేపర్‌ వ్యాల్యుయేషన్‌ చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ నెల 14న ఈ (పేపర్‌–1, పేపర్‌–2) పరీక్షలు టీఎస్‌పీఎస్సీ నిర్వహించింది. ఒక్కో పేపర్‌లో 150 చొప్పున 300 మార్కులకు పరీక్షలు పెట్టింది. అయితే ఓ ప్రైవేటు బ్లాగ్‌ నుంచి దాదాపు 200 ప్రశ్నలను యథాతథంగా ఇచ్చారంటూ పలువురు అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో టీఎస్‌పీఎస్సీ అధికారులు బ్లాగ్‌లో ఉన్న ప్రశ్నలను, పరీక్షలో వచ్చిన ప్రశ్నలను పరిశీలించి.. రెండు పేపర్లలోనూ కొన్ని ప్రశ్నలు యథాతథంగా వచ్చినట్లు తేల్చారు. దీనిపై లోతుగా అధ్యయనం చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి.. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు కమిటీ తన నివేదికను శనివారమే టీఎస్‌పీఎస్సీకి అందజేసింది. సోమవారం టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ నివేదికను సభ్యులు, అధికారులు పరిశీలించారు.

67 ప్రశ్నలు తొలగింపు..
ప్రైవేటు బ్లాగ్‌ నుంచి కొన్ని ప్రశ్నలను యథాతథంగా ఇచ్చినట్లుగా కమిటీ తన నివేదికలో పేర్కొంది. పేపర్‌–1లో 12 ప్రశ్నలు, పేపర్‌–2లో 55 ప్రశ్నలను యథాతథంగా ఇచ్చారని వెల్లడించింది. దీంతో కమిషన్‌ వివిధ కోణాల్లో పరిశీలన జరిపింది. పరీక్షను రద్దు చేయాలా.. అన్న దానిపై ఆలోచనలు చేసింది. అయితే పేపర్‌ లీకేజీ, పెద్ద ఎత్తున మాల్‌ ప్రాక్టీస్‌ జరిగిన సందర్భాల్లోనే పరీక్షను రద్దు చేయాలన్న నిబంధన ఉందని, బ్లాగ్‌ నుంచి ప్రశ్నలను కాపీ చేయడం లీకేజీ కిందకు రాదన్న అభిప్రాయానికి వచ్చింది. మరోవైపు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అదే చెబుతోందని, కాపీ చేసిన ప్రశ్నలను తొలగించి మిగతా ప్రశ్నలతో పేపర్‌ వ్యాల్యుయేషన్‌ చేయాలని, వాటిని మొత్తం మార్కులతో నార్మలైజ్‌ చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని కమిషన్‌ ఆలోచనకు వచ్చింది. ఆ మేరకు 67 ప్రశ్నలను తొలగించి మిగతా ప్రశ్నలతో పేపర్లు వ్యాల్యుయేషన్‌ చేసి 300 మార్కులకు నార్మలైజ్‌ చేయాలని నిర్ణయించింది. 

అదే బ్లాగ్‌ నుంచి మరో పరీక్షకు..
ఈ నెల 16న జరిగిన గురుకుల జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలలోనూ అదే బ్లాగ్‌ నుంచి ప్రశ్నలు వచ్చాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిని పరిశీలించాలని అధికారులను టీఎస్‌పీఎస్సీ ఆదేశించింది. అవసరమైతే కమిటీకి అప్పగించి దర్యాప్తు చేయించాలని పేర్కొంది. మరోవైపు బ్లాగ్‌ నుంచి ప్రశ్నలను కాపీ చేసి ప్రశ్నపత్రం రూపొందించిన అధికారిని శాశ్వతంగా బ్లాక్‌లిస్టులో పెట్టడంతోపాటు ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. అలాగే చట్టపరంగా చర్యలు చేపట్టాలని సంబంధిత యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌కు లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది.

 

మరిన్ని వార్తలు