2,118 ‘వైద్య’ పోస్టులకు ఓకే

3 Jul, 2016 03:48 IST|Sakshi

 భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం
 ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు
 త్వరలో టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్
 ‘సాక్షి’తో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి

 సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో 2,118 మంది వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ అవుతాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఉత్తర్వుల జారీ అనంతరం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నోటిఫికేషన్ జారీ చేయనుందన్నారు.
 
 వైద్య ఆరోగ్యశాఖలో 2,400 పోస్టులను భర్తీ చేయాలని గతంలో కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఖాళీలపై కసరత్తు చేసిన అధికారులు భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్యను 2,118గా లెక్కగట్టారు. వాస్తవానికి 6 వేల వరకు ఖాళీలు ఉన్నా 2,118 పోస్టులనే భర్తీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. చాలా చోట్ల ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నందున అక్కడ వారి సేవలనే తీసుకోనుంది. నాలుగో తర గతి ఉద్యోగులను, ఎన్‌ఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోల భర్తీ చేసే అవకాశం లేదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు డీఎంఈ పరిధిలో 1,482 ఖాళీలుంటే అందులో 665 ఖాళీలు నాలుగో తరగతి ఉద్యోగాలే ఉండటం గమనార్హం.
 
 అయితే నాలుగో తరగతి ఉద్యోగాల భర్తీ ఉండబోదని వైద్య వర్గాలు తెలిపాయి. డీఎంఈ పరిధిలో 206 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉండగా నేరుగా భర్తీ చేయడానికి అవకాశం ఉన్న 124 పోస్టులనే భర్తీ చేయనున్నారు. అలాగే 279 స్టాఫ్ నర్సు పోస్టులు, 121 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 121 గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు, కుటుంబ సంక్షేమం, ప్రజారోగ్య విభాగంలో 328 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, ఈ విభాగంలోని 772 స్టాఫ్ నర్సు పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 150 వైద్య పోస్టులన్నీ నేరుగా భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నవే. ఆ ప్రకారమే వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు