ఆర్టీసీకి కోవిడ్‌ ఎఫెక్ట్‌

8 Mar, 2020 04:25 IST|Sakshi
ప్రయాణికులు లేక వెలవెలబోతున్న వనపర్తి నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఆర్టీసీ బస్సు

బాబోయ్‌ హైదరాబాద్‌

సిటీకి రావాలంటే బెంబేలెత్తుతున్న పొరుగు రాష్ట్రవాసులు

బీదర్, యాద్గిర్, ఉద్గీర్‌ మధ్య బస్సుల్లో పలచగా ప్రయాణికులు

రాష్ట్రంలోని ఇతర పట్టణాల బస్సులదీ అదే పరిస్థితి

ఆర్టీసీకి నిత్యం కోటి రూపాయల వరకు నష్టం

సాక్షి, హైదరాబాద్‌: నగరం నుంచి బీదర్‌కు ఆర్టీసీ రోజూ 50 బస్సులను తిప్పుతోంది. వీటి ఆక్యుపెన్సీ రేషియో 80కి పైమాటే. కానీ రెండ్రోజులుగా ఈ బస్సుల్లో ఒక్కోదానిలోనూ ఐదారుగురికి మించి ఉండటం లేదు. ఫలితంగా బస్సులు ఖాళీగా తిప్పాల్సిన పరిస్థితి.. నగర మార్కెట్లలో కర్నూలుకు చెందిన ఉల్లి, బియ్యం వ్యాపారుల వాటా పెద్దదే. అందుకే నిత్యం కర్నూలు నుంచి నగరానికి వీరి రాకపోకలు ఎక్కువ.. కానీ నాలుగు రోజులుగా రెండు ప్రాంతాల మధ్య తిరిగే బస్సులు బోసిపోయాయి. ఈ పరిస్థితుల్లో నాలుగు రోజులుగా ఆర్టీసీ రోజువారీ నష్టం రూ.కోటికి చేరుకుందని అధికారులు చెబుతున్నారు.

కోవిడ్‌ ప్రభావంతో.. 
మినీ భారత్‌గా వెలుగొందే భాగ్యనగర వీధులు నిత్యం పొరుగు రాష్ట్రాల వారితో కిటకిటలాడుతుండేవి. అన్ని ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడ్డారు. వారితో సంబంధ బాంధవ్యాలున్న వారి రాకపోకలు ఇక్కడకు ఎక్కువ. దీనికి తోడు నగరంలోని జరిగే వ్యాపార లావాదేవీల్లో ఇతర రాష్ట్రాల వారి హవా కూడా ఎక్కువే. ఫలితంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని సరిహద్దు పట్టణాలవారు నిత్యం పెద్దసంఖ్యలో హైదరాబాద్‌కు వస్తుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్‌తో నగరానికి ఉన్న సంబంధాలు అసాధారణం. ఇక్కడికి వైద్య సేవల కోసం వచ్చే వారి సంఖ్యా ఎక్కువే. ఈ క్రమంలో నిత్యం దాదాపు లక్షమంది కంటే ఎక్కువే వచ్చి వెళ్తుంటారు. కానీ, నాలుగు రోజులుగా తీరు మారింది.

కోవిడ్‌ వైరస్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ అంటేనే బయటి ప్రాంతాల వారు హడలిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంతో మరింత బెంబేలెత్తుతున్నారు. కొంతకాలం సిటీకి దూరంగా ఉండటమే మంచిదన్న భావనతో చాలామంది రాకపోకలు తగ్గించుకున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులు బాగా తగ్గిపోయారు. ఇటు తెలంగాణ ఆర్టీసీ, అటు ఆయా రాష్ట్రాల రవాణా సంస్థల బస్సులు ఖాళీగా కనిపిస్తున్నాయి. కొన్ని సర్వీసులు రెండువైపులా రద్దయ్యాయి. వ్యక్తిగత వాహనాల్లో వచ్చే వారి సంఖ్య కూడా మూడొంతులు తగ్గిందని, రైళ్లలో ప్రయాణాలు మాత్రం అంతగా తగ్గలేదని అధికారులు అంటున్నారు.

షిర్డీ బస్సులో ఇద్దరే.. 
కర్ణాటకలోని యాద్గిర్, రాయచూర్, బీదర్‌ నుంచి రోజూ 250 బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో 40 శాతం మించట్లేదు. దీంతో సగం బస్సులు తిప్పలేని దుస్థితి.. అలాగే మహారాష్ట్రలోని ఉద్గీర్, చత్తీస్‌గఢ్‌లోని కొన్ని పట్టణాల తోపాటు ముంబై, షిర్డీకి కూడా నిత్యం పలు బస్సులు తిరుగుతున్నాయి. కాగా, బీదర్, యాద్గీర్, రాయచూర్‌ బస్సు సర్వీసులు క్రమంగా నిలిచిపోతున్నాయి. గాంధీ ఆసుపత్రిలో అనుమానిత లక్షణాలతో ఇద్దరు చేరారన్న వార్తలు వచ్చిన తర్వాత పరిస్థితి మరీ క్షీణించింది. దీంతో చాలామంది సిటీలో పనులను వాయిదా వేసుకోగా, వైద్య సేవలు అవసరం ఉన్న వారు బెంగళూరుకు వెళ్తున్నారు. ఇక శుక్రవారం రాత్రి నగరం నుంచి షిర్డీ వెళ్లాల్సిన ఆర్టీసీ ఏసీ బస్సులో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉండటంతో సర్వీసును రద్దు చేశారు. ఏకంగా 24 అడ్వాన్సు బుకింగ్స్‌ రద్దయ్యాయి. శుక్ర, శనివారాల్లో మహారాష్ట్రలోని ఉద్గీర్‌ నుంచి రావాల్సిన సర్వీసులు కొన్ని ఆగిపోయాయి. నగరం నుంచి తిరుగు ప్రయాణమయ్యే వారి సంఖ్య పలచగా ఉండటంతో ఇక్కడి నుంచి కూడా సర్వీసులను తగ్గించారు.

కర్నూలు వ్యాపారులేరీ? 
నగర మార్కెట్లకు కర్నూలు నుంచి నిత్యం వందల సంఖ్యలో బియ్యం లారీలు వస్తాయి. మూడు రోజులుగా వాటి సంఖ్య తగ్గిపోతోంది. అలాగే ఉల్లిపాయల లోడ్లు కూడా తగ్గాయి. విజయవాడ, గుంటూరు నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య కూడా పడిపోయిందని, అటువైపు వెళ్లే సర్వీసులను తగ్గించుకుంటున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బెంగళూరు బస్సుల్లో ఐదారుగురికి మించి ఉండటం లేదు. పొరుగు రాష్ట్రాలకే కాక తెలంగాణలోని ఇతర పట్టణాలకు వెళ్లే బస్సుల్లోనూ ప్రయాణికుల సంఖ్య పలచబడింది. ఫలితంగా ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో కొన్ని సర్వీసుల్లో 40 శాతానికి పైగా పడిపోయింది. సగటున 20 శాతం వరకు తగ్గిందని అధికారులు అంటున్నారు. రైళ్లలో మాత్రం 2 నుంచి 3 శాతం మేర ప్రయాణికుల సంఖ్య తగ్గినట్టు అంకెలు చెబుతున్నాయని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు