కరీంనగర్‌లో తృటిలో తప్పిన ప్రమాదం

10 Jul, 2019 13:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆర్టీసీ బస్సుకు బ్రేకుల్‌ ఫెయిల్‌...

సాక్షి, కరీంనగర్‌: ఆర్టీసీ డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో కరీంనగర్‌లో బుధవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ట్రాఫిక్ రద్దీగా ఉండే రోడ్డుపై బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే...కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి సిరిసిల్లకు బయలుదేరిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ప్రతిమ మల్టీప్లెక్స్ ముందు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద  బ్రేక్ ఫెయిల్ అయింది. ఆ సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడంతో బ్రేక్ ఫెయిల్ అయిందని గమనించిన డ్రైవర్ కలెక్టరేట్ రోడ్డు వైపు బస్సు తిప్పి డివైడర్‌ను ఢీ కొట్టాడు.

వేగంగా ఉన్న బస్సు డివైడర్ పైకి ఎక్కి నిలిచిపోయింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు.  సిగ్నల్ వద్ద బస్సును స్లో  చేసేందుకు డ్రైవర్ బ్రేక్ వేయగా బస్సు ఆగకపోవడంతో కలెక్టర్ వైపు తిప్పి డివైడర్‌ను ఢీ కొట్టినట్లు డ్రైవర్ తెలిపారు. కాగా డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనదారులు పాదచారులపై బస్సు దూసుకెళ్లి పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు భావిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు అక్కడికి చేరుకొని బస్సును పరిశీలించి ఘటనపై విచారణకు ఆదేశించారు. మొత్తానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు