మళ్లీ ఎర్ర బస్సులు!

20 Dec, 2019 00:35 IST|Sakshi

ఈసారి కార్గో సర్వీసులకు వాడాలని ఆర్టీసీ నిర్ణయం

జనవరి ఒకటి నుంచి ప్రారంభం

ఏడు టన్నుల బరువు మోసేలా సిద్ధం

కండక్టర్, డ్రైవర్‌ ఉద్యోగ భద్రతపై త్వరలో నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: జనవరి ఒకటి నుంచి ఎరుపు రంగులో ఆర్టీసీ సరుకు రవాణా వాహనాలు రోడ్డెక్కబోతున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఆర్టీసీలోని పాత బస్సులను సరుకు రవాణా వాహనాలుగా మార్చి, గోదాములతో ప్రమేయం ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్లతో అనుసంధానించుకుని ఇవి సరుకును తరలిస్తాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పాత బస్సులను సరుకు రవాణా వాహనాలుగా మార్చే కసరత్తు మొదలైంది. ఈనెల 23న తొలి వాహనం సిద్ధం కానుంది. దాన్ని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పరిశీలించి సమ్మతి తెలపగానే అదే తరహాలో అన్ని బస్సులను సిద్ధం చేయనున్నారు. తొలి విడతలో కనీసం వంద బస్సులను రూపొందించనున్నారు.

ఈ విషయంలో జాప్యం చేయకుండా, జనవరి ఒకటి నాటికి ఎన్ని వాహనాలు సిద్ధమైతే అన్నింటితో సరుకు రవాణాను ప్రారంభించాలని అజయ్‌కుమార్‌ ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్‌లో ఆర్టీసీ ఈడీలు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయి దీనిపై చర్చించారు. ఈ వాహనాలు పూర్తి ఎరుపు రంగులో ఉండాలని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సరుకు రవాణా వాహనాలకు అదే రంగును వాడుతున్నందున, వీటికి కూడా అదే రంగును వాడాలని ఆయన ఆదేశించారు. వాహనం వెనకవైపు కొంతమేర క్రీమ్‌ కలర్‌ ఉంటుంది. ఒక్కోబస్సు ఇంచుమించు 7 టన్నుల సరుకును మోసే సామర్థ్యంతో సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికి వాటికి తెలంగాణ ఆర్టీసీ కార్గో సర్వీసు అన్న పేరును వినియోగించాలని, తర్వాత మంచి పేరు పరిశీలనకు వస్తే మారుద్దామని పేర్కొన్నారు.

త్వరలో ‘యాదగిరి’ నివేదిక
డ్రైవర్, కండక్టర్‌ ఉద్యోగ భద్రతకు సంబంధించి నాలుగైదు రోజుల్లో స్పష్టత రానుంది. రోజువారి విధుల్లో జరుగుతున్న తప్పిదాలకు సంబంధించి డ్రైవర్, కండక్టర్లపై తీవ్ర చర్యలు తీసుకుంటున్నారన్నది ఉద్యోగుల ఆవేదన. వాటి ల్లో మార్పుచేర్పులకు సంబంధించి ఈడీ యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీని రెండు మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రి ఆదేశించారు. ప్రయాణికులు టికెట్‌ తీసుకోకుంటే కండక్టర్లను బాధ్యులను చేసే విధా నం తెరమరుగుకానుంది. దీనికి ప్రయాణికులనే బాధ్యులను చేస్తూ వారికి విధించే పెనాల్టీలను పెంచే అవకాశం ఉంది.

సీఎం ప్రకటించిన హామీల అమలు తీరుపై కూడా మంత్రి సమీక్షించారు. ఇప్పటికే చాలా అంశాలను అమలు చేసినందున మిగతా వాటిని త్వరలో పూర్తి చేయాలని ఎండీ సునీల్‌శర్మను ఆదేశించారు. ఉద్యోగుల్లో సుహృద్భావ వాతావరణాన్ని తీసుకురావడానికి వన భోజనాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, గ్రేటర్‌ హైదరాబాద్‌ రీజియన్‌లో ఈ నెల 24న నిర్వహించనున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సమావేశంలో ఈడీలు పురుషోత్తం, వినోద్, యాదగిరి, టి.వి.రావు, ఓఎస్డీ కృష్ణకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా