ఆర్టీసీలో అప్పుడే ఎన్నికల వే‘ఢీ’..!

9 Aug, 2018 04:17 IST|Sakshi

ఈ నెల 7తో ముగిసిన గుర్తింపు యూనియన్‌ పదవీకాలం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల వేడి మొదలైంది. ప్రస్తుతం ఉన్న గుర్తింపు యూనియన్‌ పదవీకాలం ఈనెల 7వ తేదీతో ముగిసింది. దీంతో తిరిగి ఎన్నికల హడావుడి మొదలైంది. ఏపీలో ఇప్పటికే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయిన దరిమిలా ఇక్కడా అదే వాతావరణం నెలకొంది. దీంతో కొందరు యూనియన్‌ నేతలు అపుడే ప్రచారం కూడా మొదలుపెట్టారు. మంగళవారం అన్ని యూనియన్లు మోటారు వాహన సవరణ బిల్లు–2016కు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్నాయి. సాయంత్రానికి సమ్మె ముగియగానే పలు యూనియన్ల నేతలు ఎన్నికలపై దృష్టిసారించారు. 

కీలక నిర్ణయాల్లో..! 
ఆర్టీసీలో ప్రతీ రెండేళ్లకోసారి గుర్తింపు యూనియన్‌ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో విజయం సాధించిన యూనియన్‌ గుర్తింపు యూనియన్‌గా రెండేళ్లపాటు కొనసాగుతుంది. ఆర్టీసీ తీసుకునే పలు కీలక నిర్ణయాలు, చర్చలు, వివిధ కార్యక్రమాల్లో ఈ యూనియన్‌ సభ్యులకు అధికారికంగా ఆహ్వానం లభిస్తుంది. ఫలితంగా కార్మికుల సమస్యలు, ఇబ్బందులను నేరుగా సంస్థ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఈ యూనియన్‌కు దక్కుతుంది. పదవీకాలం ముగిసినా.. ఎన్నికలు నిర్వహించే వరకు ఈ యూనియనే ఆపద్ధర్మ గుర్తింపు యూనియన్‌గా కొనసాగుతుంది. 

2013 నుంచి టీఎంయూనే..! 
ప్రస్తుతం గుర్తింపు యూనియన్‌గా ఉన్న తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ 2013 నుంచి ఆర్టీసీలో తన హవా కొనసాగిస్తోంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా పురుడుపోసుకున్న టీఎంయూ, ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) కలసి 2012 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. 2013 జనవరి 3న అధికారిక యూనియన్‌గా ఉత్తర్వులు వచ్చాయి. 2015 జనవరి 2తో వీరి పదవీకాలం ముగిసింది. తరువాత 2016 జూలైలో మరో సారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఎంయూ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించింది. మొత్తానికి ఐదున్నరేళ్లుగా టీఎంయూ అధికారిక యూనియన్‌గా ఉండటం విశేషం. గతానుభవాల దృష్ట్యా ఈ మారు ఎన్నికలు సకాలంలో జరుగుతాయా..లేదా వాయిదా పడుతాయా అనే చర్చకూడా కార్మికుల్లో సాగుతోంది. ఎందుకైనా మంచిదని కొన్ని సంఘాలు అప్పుడే సామాజిక మాధ్యమాల్లో తమ ప్రచారం ముందస్తుగానే ప్రారంభించేశాయి. ఎన్నికలు వాయిదా వేస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నాయి.   

మరిన్ని వార్తలు