సమ్మెలోనే ఆర్టీసీ డ్రైవర్‌ పదవీ విరమణ

1 Nov, 2019 13:14 IST|Sakshi
నారాయణను సన్మానిస్తున్న నాయకులు

సత్కరించిన తోటి కార్మికులు

ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తాం

ఆర్టీసీ జేఎసీ సూర్యాపేట డిబిజన్‌ నాయకులు

కోదాడ అర్బన్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా ప్రభుత్వం దిగిరావడం లేదు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తాము సమ్మె కొనసాగిస్తామని, ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గేది లేదని ఆర్టీసీ జేఎసీ నాయకులు పేర్కొన్నారు. కోదాడ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్‌ నారాయణ గురువారం పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో ఆయనకు కార్పొరేషన్‌ తరఫున అన్ని బెన్‌ఫిట్స్‌ ఇస్తూ సత్కరించాల్సి ఉండగా ప్రభుత్వ విధానంతో సమ్మెలో కార్మికులు ఉండటంతో కార్మికులే ఆయనను  సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మొండి వైఖరితో పదవీ విరమణ పొందుతున్న కార్మికులు తీవ్ర మనోవేదన  చెందుతున్నారన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులను గారడీ మాటలతో అందలం ఎక్కించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు ఆ కార్మికులను పాతాళానికి తొక్కేయ్యాలని చూస్తున్నారని ఆరోపించారు.  ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ముఖ్యమంత్రి ఎన్ని కుయుక్తులు పన్నినా కార్మికులు డిమాండ్లు సాధించుకొనేందుకు ముందుకు పోతారే తప్ప వెనక్కు తగ్గరన్నారు. పదవీ విరమణ పొందిన నారాయణకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్‌ వచ్చే విధంగా యూనియన్లు చర్యలు తీసుకుంటాయని వారు తెలిపారు. డ్రైవర్‌ నారాయణ మాట్లాడుతూ కార్మికులు అనుభవిస్తున్న గడ్డు కాలంలో పదవీ మిరణ పొందడం దురదృష్ణకరంగా భావిస్తున్నానని, ఆర్టీసీ పరిరక్షణకు జరుగుతున్న ఉద్యమంలో కార్మికులతో కలిసి ముందుకుసాగుతానన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఎసీ సూర్యాపేట నాయకుడు ఎస్‌ఎస్‌ గౌడ్, కోదాడ నాయకులు సైదులు, రాజశేఖర్, డ్రైవర్లు, కండక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు