సమ్మె విరమించి విధుల్లో చేరుతాం

26 Nov, 2019 01:44 IST|Sakshi

అఖిలపక్ష నేతలతో భేటీ తర్వాత జేఏసీ ప్రకటన

షిఫ్ట్‌కోసం నేడు కార్మికులు డిపోలకు వెళ్లాలి

ప్రజల కోణంలో ఆలోచించే విరమణ: అశ్వత్థామరెడ్డి

తాత్కాలిక సిబ్బంది ఇక విధుల నుంచి తప్పుకోవాలి

లేబర్‌ కోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకముంది 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అత్యంత సుదీర్ఘంగా 52 రోజులపాటు చేపట్టిన సమ్మెను ఆర్టీసీ జేఏసీ ఎట్టకేలకు విరమించింది. అక్టోబర్‌ 5న ప్రారంభించిన సమ్మెను ప్రజలు, కార్మికుల కోణంలో ఆలోచించి విరమించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. మంగళవారం ఉదయం 6 గంటలకు తొలిషిఫ్ట్‌ విధులకు హాజరయ్యేందుకు కార్మికులంతా డిపోలకు వెళ్లాల్సిందిగా పిలుపునిచ్చింది. సోమవారం మధ్యాహ్నం అఖిలపక్ష నేతలతో ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో భేటీ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ తదితరులు ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. ‘ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు చేపట్టిన ఈ ఉద్యమంలో నైతిక విజయం కార్మికులదే.

ప్రజలు, కార్మికుల కోణంలో ఆలోచించి సమ్మెను విరమించాలని నిర్ణయించాం. కానీ ఆర్టీసీ పరిరక్షణ ఉద్యమం మాత్రం ఆగదు. దశలవారీగా కొనసాగుతుంది. మంగళవారం ఉదయం కార్మికులు విధులకు హాజరు కావాలి. ఇంతకాలం బస్సులు నడిపిన తాత్కాలిక సిబ్బంది ఇక విధుల నుంచి తప్పుకొని సహకరించాలి. వారిపై మాకేమీ కోపం లేదు. సమ్మెను విరమించినంత మాత్రాన కార్మికులు ఓడినట్టు కాదు.. ప్రభుత్వం గెలిచినట్టు కాదు. సంస్థలో ఉంటూ సంస్థ ప్రైవేటీకరణ కాకుండా పోరాటానికి నాంది పలుకుతున్నాం.

కార్మికులు ఆందోళన చెందొద్దు...
‘52 రోజుల సుదీర్ఘ శాంతియుత పోరాటంలో భాగస్వాములైన కార్మికులు, అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు, ఉద్యోగ ఉపాధ్యాయ, బ్యాంకు, ఇన్సూరెన్స్, రిటైరైన ఉద్యోగులు, మీడియా సిబ్బంది, పోలీసులు... అందరికీ ధన్యవాదాలు. లేబర్‌ కోర్టులో కార్మికులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. కార్మికులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. సమ్మెకాలంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటాం. సమ్మె విరమించినా పోరాటం చేయాల్సి ఉన్నందున జేఏసీ కొనసాగుతుంది. కార్మికులంతా ఇన్ని రోజులూ ఐకమత్యంతో ఉండటం ఉద్యమస్పూర్తికి పునాది. వారి పోరాటం వృథాగా పోదు. సమ్మె ఉద్దేశం సమస్యల పరిష్కారమే తప్ప విధులను విడిచిపెట్టడం కాదు.

కార్మికులను విధుల్లోకి తీసుకోకుంటే సమ్మెను యథావిధిగా కొనసాగిస్తాం. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తాం, విరమించగానే విధుల్లోకి వెళ్తాం. విధులకు అడ్డుచెప్పొద్దు. కొన్ని రోజులుగా పోలీసులు, రెవెన్యూ, రవాణాశాఖ అధికారులు అసలు పనులు వదిలి ఆర్టీసీపై పడ్డారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకుపోగలిగాం’అని జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు థామస్‌రెడ్డి, తిరుపతి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన సమావేశంలో అఖిలపక్ష నేతలు కోదండరాం, వి.హన్మంతరావు, వినోద్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, పోటు రంగారావు, ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి, చెరుకు సుధాకర్, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

విరమణ లేఖలు కార్యాలయాలకు..
సమ్మె విరమణకు సంబంధించిన లేఖలను జేఏసీ నేతలు అధికారుల కార్యాలయాలకు అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ, బస్‌భవన్‌.. ఇలా ప్రధాన కార్యాలయాలకు వెళ్లి అక్కడి సిబ్బందికి అందజేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 6,448 బస్సులు నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 1,838 అద్దె బస్సులు కూడా ఉన్నాయని వివరించారు. 4,608 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,448 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరైనట్లు చెప్పారు.

6,332 బస్సుల్లో టిమ్‌ యంత్రాలు వాడామని, 94 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేశామని పేర్కొన్నారు. పోలీసు పహారాలో డిపోలు... అన్ని చోట్లా సీసీ కెమెరాల ఏర్పాటు సమ్మెను విరమిస్తున్నామని ప్రకటించిన జేఏసీ, ఉదయం ఆరుకల్లా కార్మికులంతా డ్యూటీలకు వెళ్లాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని డిపోలను వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జిల్లాల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులు సాయంత్రమే పోలీసు భద్రతను కోరారు. ఈ నేపథ్యంలో అన్ని ఆర్టీసీ డిపోల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సమ్మె ఉధృతమైన సమయంలో కొన్ని డిపోల్లో ఏర్పాటు చేయగా, మిగతావాటిలో తాజాగా ఏర్పాటు చేశారు. 

విధుల్లోకి తీసుకోకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం: అశ్వత్థామరెడ్డి
‘సమ్మె విషయంలో లేబర్‌ కోర్టులో మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. ఇప్పుడు కేసును లేబర్‌ కోర్టుకు ప్రభుత్వం రిఫర్‌ చేయాల్సి ఉంది. ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును విజయవంతంగా జనంలోకి తీసుకెళ్లగలిగాం. ఈ విషయంలో నైతిక విజయం సాధించాం. హైకోర్టు సూచనలను మేం గౌరవిస్తూ ముందుకు సాగుతున్నాం. సమ్మె విరమణ కూడా అందులో భాగమే. సమ్మె విరమించినందున మేం విధుల్లో చేరాల్సి ఉంది, ఆర్టీసీ చేర్చుకోవాలి.. కానీ ఎండీ అందుకు ఒప్పుకోనంటున్నారు. ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధం. గతంలో సుప్రీంకోర్టు చెప్పిన మాటలకు భిన్నమైన వ్యవహారం. ఇది ఓ రకంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది.

మంగళవారం ఉదయం విధుల్లోకి రాకుండా మమ్మల్ని నిరోధిస్తే మేం హైకోర్టు తలుపు తడతాం. ఇప్పటివరకు వేరే వాళ్లు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో మేం ఇంప్లీడ్‌ అయ్యాం. కానీ ఇప్పుడు నేరుగా మేమే కేసు దాఖలు చేస్తాం. మంగళవారం విధుల్లోకి తీసుకోకుంటే మరోసారి అఖిలపక్ష నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఎవరికి చెప్పి సమ్మె చేశారన్నట్లుగా ఇన్‌చార్జి ఎండీ మాట్లాడుతున్నారు. సమ్మె ఎవరికో చెప్పి చేయాల్సిన అవసరం లేదు. కార్మికుల సమస్యలపై కార్మికులతో మాట్లాడి సమ్మె చేస్తాం. ఈ విషయంలో కార్మికులు అధైర్య పడాల్సిన పనిలేదు. ఆర్టీసీ ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వం చేసే హడావుడిని చూసి కూడా కార్మికులు ఆందోళన చెందాల్సిన పని లేదు’’అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు.

ఐదు రోజులుగా జేఏసీ మల్లగుల్లాలు...
వాస్తవానికి గత ఐదు రోజులుగా సమ్మె విరమణపై ఆర్టీసీ జేఏసీ మల్లగుల్లాలు పడుతోంది. కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ గత బుధవారం జేఏసీ ప్రకటించింది. అప్పట్లోనే సమ్మెను విరమించాలన్న అభిప్రాయాన్ని సింహభాగం కార్మికులు వ్యక్తం చేశారు. ఈ విషయంలో కొంత డోలాయమానంలో ఉన్న జేఏసీ నేతలు... విరమణ అంశాన్ని తీవ్రంగానే పరిశీలించారు. అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకొని నిశ్చితాభిప్రాయానికి వచ్చే ప్రయత్నం చేశారు.

సోమవారం అఖిలపక్ష భేటీలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా వారు కూడా అదే మంచి నిర్ణయమని మద్దతు తెలిపారు. సమ్మె విరమణపై జేఏసీ ప్రకటన చేసే సమయంలో సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆర్టీసీకి సంబంధించిన కీలక అంశాలపైనే చర్చ జరుగుతోందన్న వార్తలు రావడంతో జేఏసీ నేతలు అఖిలపక్ష నేతలతో సమావేశమై సమ్మె విరమణ నిర్ణయం తీసుకోవడం గమానార్హం.

మెట్టు దిగుతూ వచ్చిన జేఏసీ... బెట్టు వీడని ప్రభుత్వం
డిమాండ్ల సాథనకు ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మెను ఉధృతంగా కొనసాగిస్తామని తొలుత భీష్మించుకొని కూర్చున్న కార్మిక సంఘాల జేఏసీ... ఆ తర్వాత పరిస్థితినిబట్టి మెట్టు దిగుతూ వచ్చింది. సమస్య జటిలమై చివరకు కార్మికులు ఇబ్బంది పడే పరిస్థితి రావొద్దన్న ఉద్దేశంతో పట్టు వీడింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమనే ప్రధాన డిమాండ్‌ను సైతం తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత గత బుధవారం ఏకంగా సమ్మె విరమణ అంశాన్ని ప్రస్తావించింది.

కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమించేందుకు సిద్ధమని ప్రకటించింది. సడక్‌ బంద్‌ను కూడా విరమించింది. ఈ రెండు సందర్భాల్లో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని జేఏసీ ఆశించింది. కానీ కార్మిక సంఘాలు మెట్టు దిగినా ప్రభుత్వం మాత్రం బెట్టు వీడలేదు. ఇప్పుడు ఏకంగా సమ్మెనే విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించినా ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోగా విధుల్లోకి తీసుకోవడం సాధ్యం కాదంటూ ఎండీ పేరిట ప్రకటన విడుదల కావడం గమనార్హం.

32 మంది మృత్యువాత
సమ్మె ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు సంబంధించి 32 మంది మృతి చెందారు. వారిలో 28 వరకు కార్మికులు ఉండగా మిగతావారు వారి కుటుంబ సభ్యులున్నారు. ఆర్టీసీలో ఉద్యోగం పోయిందనే ఆవేదనతో ఎక్కువ మంది గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డారు. నలుగురు కార్మికులు మాత్రం బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారిలో ఖమ్మంకు చెందిన డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి ఒంటికి నిప్పంటించుకొని ఇంట్లోనే మరణించడం అందరినీ కలచివేసింది.

మృత్యువుతో పోరాడుతూ కూడా ఆయన... కార్మికులు బాధలో ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతితో సమ్మె ఒక్కసారిగా ఉధృతరూపం దాల్చింది. ఆ తర్వాత రాణిగంజ్‌ డిపో కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ ఉరేసుకుని చనిపోయారు. ఆయన అంతిమయాత్రలో కార్మికులు, విపక్ష నేతలు, కార్యకర్తలు, భారీగా పాల్గొనడంతో సమ్మె మరింత ఉధృతమైంది. ఆ తర్వాత సత్తుపల్లి డిపో కండక్టర్‌ నీరజ, మహబూబాబాద్‌ డిపో డ్రైవర్‌ నరేశ్‌లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు.

సమ్మె ప్రారంభం: అక్టోబర్‌ 5
సమ్మె ముగింపు: నవంబర్‌ 25
సమ్మె జరిగిన రోజులు: 52
సమ్మె కాలంలో మరణించిన కార్మికులు, వారి కుటుంబీకులు: 32  

మరిన్ని వార్తలు