సమ్మెకు సై అంటున్న ఆర్టీసీ కార్మికులు

16 Sep, 2019 10:58 IST|Sakshi
ఆదిలాబాద్‌ బస్టాండ్‌లో నిలిచి ఉన్న బస్సులు

నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాలు

17 తర్వాత ఈయూ, 25 తర్వాత టీఎంయూ

జేఏసీగా వెళ్లాలని సంఘాల ఆలోచన

సాక్షి, ఆదిలాబాద్‌ టౌన్‌: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. యాజమాన్యానికి ఇప్పటికే నోటీసు అందజేశారు. 14 రోజుల వరకు యాజమాన్యం స్పందించకుంటే సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. గత నెల నుంచి దశల వారీగా ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా బస్‌డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని ఆయా సంఘాలు భీష్మించుకు కూర్చున్నాయి. యాజమాన్యం చర్చలకు పిలవని పక్షంలో ఈనెల 17తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి దిగుతామని ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) ప్రకటించగా 19తర్వాత సమ్మె చేపట్టనున్నట్లు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్రకటించింది.

అయితే ఈనెల 25తర్వాత గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) సమ్మెకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో వారు ముందుకు కదులుతున్నారు. 2017 నుంచి పేస్కేల్‌ అమలు, ఉద్యోగ భద్రత, తదితర డిమాండ్లతో సమ్మెలోకి దిగనున్నారు. సమ్మె చేపడితే ప్రగతి రథచక్రాలు రోడ్డెక్కకుండా నిలిచిపోయే అవకాశం లేకపోలేదు. అయితే సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి జేఏ సీగాఏర్పడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఆలోచనలో ఆయా సంఘాలు ఉన్నట్లు సమాచారం.

ఉమ్మడి జిల్లాలో బస్‌ డిపోలు 6
మొత్తం బస్సులు 625
ఆర్టీసీ బస్సులు 437
అద్దె బస్సులు 188
ఆర్టీసీ కార్మికులు 2700

ఉమ్మడి జిల్లా పరిధిలో.. 
ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో ఆరు ఆర్టీసీ బస్‌డిపోలు ఉన్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూర్, భైంసా, మంచిర్యాల, నిర్మల్‌ డిపోల పరిధిలో 625 బస్సులు నడుస్తున్నాయి. అందులో 188 అద్దె బస్సులు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో 2700 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు.

సమ్మె నోటీసు ఇచ్చిన సంఘాలు..
సమ్మెలోకి వెళ్లేందుకు ఆయా సంఘాలు ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసులు అందజేశాయి. గుర్తింపు సంఘం టీఎంయూ ఈనెల 11న ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మకు నోటీసులు అందజేశాయి. యాజమాన్యం చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 25 తర్వాత ఎప్పుడైనా సమ్మె చేపట్టేందుకు ఆ సంఘం సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అదేబాటలో ఈయూ సంఘం కూడా సమ్మె నోటీసును యాజమాన్యానికి అందించింది. ఈనెల 17 తర్వాత సమ్మె చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కూడా ఈనెల 19 తర్వాత సమ్మెకు దిగనున్నట్లు తెలిపింది. అయితే ఆయా సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడి సమ్మెలోకి దిగేందుకు ఆయా సంఘాల రాష్ట్ర నాయకులు చర్చించుకుంటున్నారు. ఆర్టీసీ యాజమాన్యం స్పందించకుంటే ఆర్టీసీ ప్రగతి రథచక్రాలు రోడ్డుపైకి ఎక్కేలా కనిపించడంలేదు. ఏపీ ముఖ్యమంత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని, తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

డిమాండ్లు ఇవే 
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. 
2017 నుంచి రావాల్సిన వేతన చట్ట సవరణ చేపట్టాలి. 
కండక్టర్, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 
అన్ని కేటగిరీల్లో ఖాళీలు భర్తీ చేయాలి. 
ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సెటిల్మెంట్‌తో పాటు సకలజనుల సమ్మె కాలపు వేతనం చెల్లించాలి. 
మహిళా కండక్టర్లకు ప్రత్యేక డ్యూటీ చార్ట్‌ వేయాలి. 
ఎంటీడబ్ల్యూ చట్టం ప్రకారం 8గంటల విధి నిర్వహణకే పరిమితం చేయాలి. 
సీసీఎస్, పీఎఫ్‌ రుణాలు వెంటనే ఇవ్వడానికి అనుగుణంగా బకాయిలను యాజమాన్యం తక్షణమే చెల్లించాలి. 
విధినిర్వహణలో మృతిచెందిన ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలకు రూ.30లక్షల అదనపు పరిహారం చెల్లించాలి. 
ఉద్యోగ విరమణ చేసిన వారికి డబ్బులు అదేరోజు చెల్లించాలి. 
కాలం చెల్లిన బస్సులను తీసివేసి కొత్త బస్సులను కొనుగోలు చేయాలి. 
అద్దె బస్సులను రద్దు చేయాలి. 
పదోన్నతి, కారుణ్య నియామకాలు, కాంట్రాక్ట్‌ కార్మికుల రెగ్యులరైజేషన్‌ చేయాలి. 
మెరుగైన వైద్యసేవలు అందించాలి. 
ఐదేళ్ల ఎన్‌క్యాష్మెంట్‌తో పాటు జూలై నెల డీఏ చెల్లించాలి. 
అదనపు విధులు నిర్వహించిన కార్మికుడికి రెట్టింపు వేతనం చెల్లించాలి.

ప్రభుత్వంలో విలీనం చేయాలి 
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న పే స్కేల్‌ అమలు చేయాలి. అద్దె బస్సులను తొలగించి కొత్త బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.  జేఏసీగా ఏర్పడి సమ్మెలోకి వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నాం.
– ఎంఆర్‌ రెడ్డి, ఈయూ, రీజినల్‌ అధ్యక్షుడు

25 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి 
ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసును అందజేశాం. సమస్యల పరిష్కారానికి స్పందించకుంటే ఈనెల 25 తర్వాత సమ్మెలోకి దిగుతాం. సీసీఎఫ్, పీఎఫ్‌తో పాటు కార్మికులకు రావాల్సిన ఆర్థికపరమైన అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలి. కాలం చెల్లిన బస్సులను తొలగించాలి. 
– కిషన్, టీఎంయూ, డిపో కార్యదర్శి

మరిన్ని వార్తలు