పూటగడవక.. ప్రత్యామ్నాయం వైపు!

14 Nov, 2019 13:24 IST|Sakshi
గీత వృత్తిలో కండక్టర్‌ రమేశ్‌గౌడ్‌ , యాదగిరిగుట్ట బస్టాండ్‌లో సితాఫలాలు అమ్ముతున్న మహిళా కండక్టర్‌

ఆర్థిక ఇబ్బందుల్లో ఆర్టీసీ కార్మికులు

వేతనం రాక, ఉపాధి లేక ఇతర పనులకు

కొందరు కులవృత్తులకు.. మరికొందరు ఇతర మార్గాలను ఎంచుకుంటున్న వైనం

సమ్మె ఎటూ తేలకపోవడంతోనే ఈ నిర్ణయం

ఆర్టీసీ కార్మికులు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. రెండు నెలలుగా వేతనాలు రాకపోవడం.. మరోవైపు ఉపాధి లేక సామాన్య కుటుం బాలకు కుటుంబ పోషణ భారంగా మారింది. పిల్లల పాఠశాలల ఫీజులు, ఇంటి అద్దె చెల్లింపులు, చిట్టీలు, ఫైనాన్స్, కుటుంబ సభ్యులు అనా రోగ్యం బారిన పడితే ఆస్పత్రులకు వెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పూటగడవడం కోసం గత్యంతరం లేక ప్ర త్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. సమ్మెలో పాల్గొంటూనే ఇతర పనులు చేసుకుంటున్నారు. కొందరు కులవృత్తి చేసుకుంటుండగా మరికొందరు ఇతర పనులను ఎంచుకుంటున్నారు.          

ఇస్త్రీ చేస్తున్న మహిళా కండక్టర్‌..
చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌ పట్టణ కేంద్రానికి చెందిన సామకూర పార్వతమ్మ అలియాస్‌ మలిగె అనిత హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌ ఆర్టీసీ బస్‌డిపోలో కండక్టర్‌గా పని చేస్తుంది. 2010 సంవత్సరంలో ఉద్యోగం పొందిన ఈమె అప్పటి నుంచి అదే డిపోలో విధులు నిర్వహిస్తోంది. భర్త బాలరాజు వెల్డింగ్‌ షాప్‌లో కార్మికుడిగా పని చేస్తాడు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె. 40రోజులుగా కొనసాగుతున్న సమ్మె నేపథ్యంలో వేతనాలు అందలేదు. దీంతో కుటుంబ పోషణ, పిల్లల చదువుల కోసంగాను పార్వతమ్మ తన కులవృత్తిపై దృష్టి సారించింది. ఓ వైపు ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటూనే ప్రతి రోజు ఇస్త్రీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది.

జీతాలు లేక ఎన్నో ఇబ్బందులు

డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె ఎటూ తేలడం లేదు. రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుటుంబ పోషణకు గాను తమ కుల వృత్తి అయిన లాండ్రీ పని చేస్తున్నా. 
– పార్వతమ్మ, చౌటుప్పల్‌

పార పట్టిన ఆర్టీసీ డ్రైవర్‌
హాలియా : ఓ ఆర్టీసీ డ్రైవర్‌ తన కుటుంబ పోషణ కోసం బత్తాయి తోటలో పాదులు తీసేందుకు కూలీ పనులకు వెళ్తున్నాడు. ఆర్టీసీ సమ్మె కారణంగా ఆ డ్రైవర్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో తన కుటుంబ పోషణ నిమిత్తం వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్నాడు.హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనుముల గ్రామానికి చెందిన ఖమ్మంపాటి నర్సింహ గతంలో వ్యవసాయ కూలీ పనులకు వెళ్లేవాడు. 2006లో ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా విధుల్లో చేరాడు. వచ్చే జీతంతో ఇంటి అద్దె చెల్లిస్తూ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిని చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్టీసీ సమ్మె కారణంగా రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమైంది. ఏమీ చేయాలో పాలుపోక తన స్వగ్రామైన అనుముల గ్రామానికి వచ్చి, ఓ వైపు ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటూనే మరో పక్క కుటుంబ పోషణ కోసం అనుముల గ్రామంలోనే బత్తాయి తోటలో కూలీ పనులకు వెళ్తున్నాడు. 15 రోజులుగా పని చేస్తూ రోజుకు రూ. 300లు సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

కుల వృత్తే కూడు పెడుతోంది..
కొండమల్లేపల్లి (దేవరకొండ): కులవృత్తే నేడు ఆ కుటుంబానికి కూడు పెడుతోంది. 40రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు తలపెట్టిన నిరవధిక సమ్మె నేటికీ కొనసాగుతుండటంతో కార్మికులు ప్రత్యామ్నాయ జీవితాలపై దృష్టి సారించారు. దేవరకొండ పట్టణానికి చెందిన వెలిజాల శ్రీనివాసులు 10 సంవత్సరాల నుంచి దేవరకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆర్టీసీ సమ్మె కారణంగా నిరసన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూనే.. కుటుంబ పోషణకు దేవరకొండ పట్టణంలో తన సోదరుడు నిర్వహిస్తున్న హెయిర్‌ సెలూన్‌లో కులవృత్తిని తిరిగి ప్రారంభించాడు. సమ్మె నేపథ్యంలో వేతనాలు రాకపోవడంతో పిల్లల ఫీజులతో పాటు, నిత్యావసర వస్తువులకు సైతం ఇబ్బందులు ఎదుర్కొనక తప్పడం లేదని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

వేతనాలు అందక ఇబ్బందులు
రామన్నపేట: మూడు మాసాలుగా వేతనాలు అందక ఆర్టీసీకార్మి కులు పడరాని పాట్లు పడుతున్నారు. కుటుంబ పోషణతోపాటు పిల్లల చదువులు, వైద్యం, ఖర్చులను వెళ్లదీయడానికి నానా అవస్థలు పడుతున్నారు. రామన్నపేట మండల కేంద్రంతోపాటు తదితర గ్రామాలకు చెందినవారు యాదగిరిగుట్ట నార్కట్‌పల్లి, రాణిగంజ్, హయత్‌నగర్‌ డిపోల్లో డ్రైవర్లుగా, కండక్టర్లుగా విధులను నిర్వహిస్తున్నారు. 39రోజులుగా సాగుతున్న సమ్మె, అంతకుముందు నెలకు సంబంధించిన వేతనాలను ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ అవసరాలను తీర్చడంకోసం కార్మికులు వ్యవసాయంతోపాటు, కులవృత్తులపై దృష్టి సారించారు.

పత్తి తీయించే పనిలో..

రామన్నపేట మండలం వెల్లంకిగ్రామానికి చెందిన గోశిక కొండల్‌రెడ్డి పది సంవత్సరాలుగా యాదగిరిగుట్ట డిపోలో కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. తమ డిమాండ్ల సాధనకోసం చేపట్టిన సమ్మెలో పాల్గొంటున్నాడు. కుటుంబ అవసరాలు తీర్చడం కోసం తన పొలం వద్ద పత్తిని తీయించే పనులు చేస్తున్నాడు.

చేనేత పనిలో..
రామన్నపేట పద్మశాలి కాలనీకి చెందిన ఎం.సురేందర్‌ యా దిగిరిగుట్ట డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ అవసరాలను తీర్చడంకోసం తనకువచ్చిన చేనేతపనికి వెళ్తున్నాడు. రంగులు అద్దడం, సరిచేయడం మగ్గం నేయడంవంటి పనులుచేస్తూ కుటుంబాన్ని సాకుతున్నాడు.

చెప్పులను పాలిష్‌ చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్‌
మిర్యాలగూడెం టౌన్‌: ఈ చిత్రంలో కనిపిస్తున్నది దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెంకు చెందిన బల్గూరి చిన విజయ్‌కుమార్‌. పట్టణంలోని శాంతినగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. మిర్యాలగూడ డిపోలో 2011లో డ్రైవర్‌గా చేరగా 2015లో రెగ్యులర్‌ అయింది. ఆర్టీసీ సమ్మె కరణంగా పూట గడవటం చాల ఇబ్బందిగా మారింది. దీంతో తన కుల వృత్తి అయిన చెప్పులను కుట్టుకోవడంతో పాటు బూట్లకు పాలిష్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజుకు రూ. 250 నుంచి రూ. 350 వరకు వస్తుండడంతో కుటుంబం అంతంత మాత్రంగానే నడుస్తుంది. తాను గత మూడు నెలలుగా ఇంటి అద్దెను చెల్లించకపోవడంతో ఇల్లు ఖాళీ చేయమని అంటున్నారని వాపోతున్నాడు. తన భార్య శోభారాణి ఆనారోగ్యంగా కారణంగా ఆస్పత్రికి కూడా వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది.

హోటల్‌లో పనిచేస్తూ..
అర్వపల్లి: ఆర్టీసీ సమ్మెతో కుటుంబం గడవక ఓ డ్రైవర్‌ హోటల్‌లో కుక్‌గా పనిచేస్తున్నాడు. జాజిరెడ్డిగూడెం మండలం కోడూరుకు చెందిన దేశగాని రాములు ఉప్పల్‌ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే 40రోజులుగా కార్మికులు సమ్మెకు దిగడంతో కుటుంబం గడవక అక్కడి ఓ హోటల్‌లో ఒక్కపూట సమ్మెలో పాల్గొంటూ మరో పూట హోటల్‌లో కుక్‌గా పనిచేస్తున్నాడు.

సమ్మె తెచ్చిన తంటా..
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట డిపోకు చెందిన మహిళా కండక్టర్‌ నేతి సావిత్రి తన కుటుంబ పోషణ నిమిత్తం ప్రత్యామ్నాయ పనులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. సూర్యాపేట మండలం భీమారానికి చెందిన నేతి సావిత్రి 2008 లో ఆర్టీసీలో కండక్టర్‌గా చేరింది. సావిత్రి ప్రస్తుతం రూ.16,120ల జీతం అందుకుంటుంది. ఆమె భర్త నేతి లక్ష్మణ్‌ ఓ షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఈయనకు నెలకు రూ.8వేలు మాత్రమే వస్తుంది. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు కాగా.. పెద్దమ్మాయి పాలిటెక్నిక్‌ 3వ సంవత్సరం, చిన్నమ్మాయి 9వ తరగతి చదువుతోంది. కస్తూర్బా బజారులోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలానికి సంబంధించిన జీతంతో పాటు సెప్టెంబర్‌ మాసం జీతాలు రాకపోవడంతో టైలరింగ్‌ చేస్తుంది. ఆర్టీసీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూనే టైలరింగ్‌ చేస్తూ కుటుంబ పోషణ చూసుకుంటుంది. 

మరిన్ని వార్తలు