కాసుల గలగల !

23 Oct, 2018 08:27 IST|Sakshi
మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌లో రద్దీ

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌ : ఆర్టీసీకి దసరా పండగ కలిసొచ్చింది. పండగ సందర్భంగా ముందు నుంచి సెలవులు ముగిసే వరకు అదనపు బస్సు సర్వీసులు నడపడంతో మంచి ఆదాయాన్ని ఆర్జించింది. మహబూబ్‌నగర్‌ రీజియన్‌ వ్యాప్తంగా తొమ్మిది డిపోల నుంచి ప్రయాణికుల కోసం అధికారులు అదనంగా 299 బస్సులు నడపడంతో ఆర్టీసీ గల్లా పెట్టె కళకళలాడింది. సాధారణ రోజుల్లో కంటే రీజియన్‌ పరిధిలోని ప్రతీ డిపోకు రోజుకు సాధారణంగా కంటే రూ.లక్ష నుంచి రూ.2లక్షల అదనపు ఆదాయం నమోదు కావడం విశేషం

అదనపు సర్వీసులు 
దసరా సెలవులను పురస్కరించుకుని హైదరాబాద్‌తో పాటు ఇతరత్రా ప్రాంతాలకు స్థానికులు వచ్చి వెళ్లడం ఆనవాయితీ. దీంతో ముందుగానే ఆర్టీసీ అధికారులు ప్రణాళికాప్రకారం ముందుకు సాగారు. ఈ మేరకు 10 నుంచి అదనపు సర్వీసులు నడిపించారు. డిపోల వారీగా గద్వాల నుంచి 24, మహబూబ్‌నగర్‌ నుంచి 48, వనపర్తి నుంచి 33, షాద్‌నగర్‌ నుంచి 38, అచ్చంపేట నుంచి 29, కల్వకుర్తి నుంచి 26, కొల్లాపూర్‌ నుంచి 19 అదనపు సర్వీసులతో పాటు నాగర్‌కర్నూల్‌ డిపో నుంచి 30 అదనపు బస్సులను నడిపించారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకపోగా.. ఆర్టీసీకి భారీగా ఆదాయం నమోదైంది. అయితే, ఆదివారంతో సెలవులు ముగిసినా ప్రయాణికుల రద్దీని బట్టీ మరో రెండు రోజుల వరకు అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
 
ఆర్టీసీకి పండుగ 
పండుగ సమయంలో రెండు రోజులు మినహా ప్రతి రోజు రీజియన్‌కు అదనపు ఆదాయం లభిం చింది. సాధారణ రోజుల్లో ఆదాయం కంటే పండు గ రోజుల్లో ప్రతి డిపోకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు అదనపు వచ్చింది. రీజియన్‌లోని డిపోల్లో మహబూబ్‌నగర్‌ డిపో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తుంది. హైదరాబాద్‌ రూట్‌లో నడిపే బస్సుల ద్వారా మహబూబ్‌నగర్‌ డిపో అధిక ఆదాయాన్ని పొందుతుంది. పండుగ ముగియడంతో ప్రజలు తిరుగుప్రయాణం పట్టారు. దీంతో రీజియన్‌లోని బస్టాండ్లలో ప్రయాణీకులు కిక్కిరిసిపోతున్నారు.

రీజియన్‌లోని తొమ్మిది డిపోల్లో శనివారం రూ.97,94,306, ఆదివారం రూ.1,09,76,806 ఆదాయం నమోదైంది. సాధారణ రోజుల్లో పోలిస్తే ఆదివారం రీజియన్‌కు రూ.17లక్షలకుపైగా అదనపు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. రీజియన్‌ వ్యాప్తంగా సాధారణ రోజుల్లో 3,28,897 కిలోమీటర్లు నడిచే బస్సులు శనివారం ఆర్టీసీ బస్సులు 3,34,441 కిలోమీటర్లు, ఆదివారం 3,48,096 కిలోమీటర్లు నడిచాయి.

మరిన్ని వార్తలు