తాత్కాలిక డ్రైవర్‌కు రూ.1,500, కండక్టర్‌కు రూ.వెయ్యి

4 Oct, 2019 12:22 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఇన్‌చార్జ్‌ డీటీసీ శ్రీనివాస్‌రెడ్డి

ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయ మార్గాలు

స్కూల్‌ బస్సులు, ప్రైవేట్‌ బస్సులు నడపాలని సూచన

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఆర్టీసీ కార్మికులు శనివారం నుంచి సమ్మె నిర్వహిస్తున్న సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సులు నడవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని ఇన్‌చార్జ్‌ డీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. సమ్మె చేస్తున్న కాలంలో స్కూల్‌ బస్సులు నడపాలని దీని కోసం రోజు రూ.100 ట్యాక్స్‌ చెల్లించడంతోపాటు వారానికి రూ.200 ఫీజు చెల్లించి ఉమ్మడి జిల్లాలో ఏ రూట్‌లో అయిన బస్సులు నడుపుకొనే అవకాశం కల్పించామన్నారు. స్కూల్‌ బస్సులతోపాటు ప్రైవేట్‌ బస్సులు సైతం నడుపుకోవడానికి అనుమతి ఇస్తున్నామని, ప్రైవేట్‌ బస్సులు అయితే హైదరాబాద్, కర్నూలు ఇతర దూర ప్రాంతాలకు వెళ్లవచ్చన్నారు.

అదేవిధంగా ఆర్టీసీ బస్సులు నడపడానికి హెవీ మోటార్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండి ఏడాదిన్నర వాహనం నడిపిన అనుభవం కలిగిన వారిని తాత్కాలిక డ్రైవర్లుగా, పదో తరగతి చదివిన వారిని కండక్టర్లుగా తాత్కాలికంగా తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో రోజుకు డ్రైవర్‌కు రూ.1,500, కండక్టర్‌కు రూ.వెయ్యి వేతనం చెల్లిస్తామన్నారు. ఆసక్తి గలవారు శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్టాండ్‌లో కానీ ఆర్టీఓ కార్యాలయంలో కాని సంప్రదించాలన్నారు. కండక్టర్లు వచ్చేటప్పుడు పదో తరగతి జిరాక్స్‌ మెమో, డ్రైవర్లు హెవీ లైసెన్స్‌ తీసుకురావాలన్నారు. ఒకవేళ ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉపసంహరించుకుంటే పాత పద్ధతిలోనే బస్సులు నడుస్తాయన్నారు.    

మరిన్ని వార్తలు