ఆర్టీసీ బస్సుల అద్దె పెంపు

22 Dec, 2019 02:10 IST|Sakshi

పెరిగిన టికెట్‌ చార్జీల ఆధారంగా సవరింపు

పల్లె వెలుగు నుంచి స్లీపర్‌ సర్వీసు వరకు మార్పులు

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలే కిలోమీటరుకు 20 పైసలు చొప్పున బస్సు చార్జీలు పెంచిన ఆర్టీసీ, తాజాగా సొంత బస్సులను ప్రైవేటు కార్యక్రమాలకు అద్దెకు ఇచ్చేందుకు గాను చార్జీలను పెంచింది. పెంచిన రవాణా చార్జీలను పరిగణనలోకి తీసుకుని ఈ ధరలను సవరించింది. పల్లెవెలుగు మొదలు స్లీపర్‌ సర్వీసు వెన్నెల వరకు అన్ని కేటగిరీల బస్సు హైర్‌ చార్జీలను పెంచింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, యాత్రలు, ప్రైవేటు కార్యక్రమాలకు బల్క్‌ గా బుక్‌ చేసుకుంటే ఆర్టీసీ సొంత బస్సులను కేటాయిస్తోంది.వీటికి శ్లాబ్‌ పద్ధతిలో ఛార్జీలు విధిస్తుంది. కనిష్టంగా 8 గంటలు–200 కి.మీ.లు. గరిష్టంగా 24 గంటలు–480 కి.మీ. పద్ధతిలో ఆ ధరలు ఉంటాయి.

ఆక్యుపెన్సీ రేషియో ఆధారంగా సాధారణ సమయాలు, పీక్‌ సమయాలుగా పేర్కొంటూ వేరువేరు రేట్లు ఉంటాయి. ఇప్పు డు వాటిని ఆర్టీసీ పెంచింది. కిలోమీటరుకు పల్లెవెలుగుకు సాధారణ సమయాల్లో రూ.40, కీలక (పీక్‌) వేళల్లో రూ.44, ఎక్స్‌ప్రెస్‌ రూ.47, రూ.49, డీలక్స్‌ (దీనికి ఒకటే ధర) రూ.49, సూపర్‌లగ్జరీ రూ.50 గా నిర్ధారించింది. వజ్ర బస్సులను తొలగించాలని నిర్ణయించినప్పటికీ, అవి కొనసాగినన్ని రోజులు అమలుచేసేలా వాటి ధరలను కూడా సవరించింది. సిటీ బస్సులకు విడిగా ధరలు కేటాయించింది. కనిష్టంగా 6 గంటలు–90 కి.మీ., గరి ష్టంగా 16 గంటలు–240 కి.మీ. ప్రాతిపదికన ఉన్నాయి. అన్ని బస్సుల కాషన్‌ డిపాజిట్‌మొత్తాలను  పెంచింది. మిగతా నిబంధనలు యథావిధిగా ఉంచింది. ఇలా భారీ ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ భావిస్తోంది. ఆదివారం నుంచే కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి.

మరిన్ని వార్తలు