రెండోరోజూ అదేతీరు

7 Oct, 2019 03:10 IST|Sakshi
ఆదివారం జూబ్లి బస్‌స్టేషన్‌లో బారులు తీరిన బస్సులు..

చాలినన్ని బస్సుల్లేక ఇబ్బందులు..

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మె రెండో రోజు కూడా ప్రయాణికులపై ప్రభావం చూపింది. అయితే, శనివారంతో పోలిస్తే ఆదివారం కొంత మెరుగ్గా ఉన్నా, అన్ని ప్రాంతాలకు చాలినన్ని బస్సుల్లేక జనం ఇబ్బందిపడ్డారు. ప్రధాన రూట్లలో బస్సులు తిరిగినా, ఊళ్లకు మాత్రం సరిగా నడపడంలో విఫలమయ్యారు. ప్రధాన రూట్లలో వెళ్లేం దుకు ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో చాలా బస్సులు ఖాళీగానే వెళ్లాయి. ఆదివారమే సద్దుల బతుకమ్మ కావడంతో ఎక్కువమంది శనివారమే ఊళ్లకు వెళ్లారు. 
(చదవండి : సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు సర్కారు షాక్‌)

ఇక చార్జీల విషయంలో నియంత్రణ లేకపోవటంతో ఇష్టం వచ్చినట్టు వసూలు చేసి ప్రయాణికుల జేబు గుల్ల చేశారు. దీనిపై ఫిర్యాదులు ఎక్కువ కావటంతో కొన్ని చోట్ల పోలీ సులు దృష్టి సారించారు. చార్జీలు ఎక్కువ వసూలు చేయొ ద్దని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసు సిబ్బంది ప్లకార్డులు ప్రదర్శించారు. ఎక్కడైనా అదనంగా వసూలు చేస్తే 100 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీ నడిపిన ప్రైవేటు వాహనాలు కాకుండా, రోడ్లపై తిరిగే సాధారణ వాహనాల్లో మాత్రం ఆదివారం మరింత రేటు పెంచి వసూళ్లకు పాల్పడ్డారు.

వినూత్న నిరసనలు...
సమ్మె రెండోరోజు జిల్లాల్లో పరిస్థితి కొంత మెరుగుపడింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాతోపాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఉమ్మడి పాలమూరు రీజియన్లలో బస్సులు బాగానే నడిచాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో వీటిని నడిపించారు. నర్సంపేట నుంచి వరంగల్‌ రోడ్డులో తాత్కాలిక డ్రైవర్‌ నడుపుతున్న బస్సు చెట్టును ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. 

ఖమ్మం జిల్లాలోని నాయుడుపేట హనుమాన్‌ టెంపుల్‌ వద్ద ఖమ్మం–సూర్యాపేట ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి రాళ్లతో దాడి చేశారు. సమ్మెలో భాగంగా ఆర్టీసీ సిబ్బంది పలుచోట్ల నిరసనలు తెలిపారు. కొన్నిచోట్ల కార్మికులు మహిళల వస్త్రధారణతో బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. మరికొన్ని చోట్ల ముఖాలకు నల్లరిబ్బన్లు కట్టుకొని వినూత్నంగా బతుకమ్మ ఆడారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం రావిచేడ్‌లో ఓ డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ సృష్టించాడు.

11 వేల వాహనాలు తిప్పాం: ఆర్టీసీ
ప్రయాణికులకు ఇబ్బందులు కలగని రీతిలో పెద్ద సంఖ్యలో బస్సులు, ఇతర వాహనాలను తిప్పినట్టు ఆర్టీసీ పేర్కొంది. సమ్మె తొలిరోజు శనివారం 9వేల వాహనాలు తిప్పగా.. ఆదివారం 11వేలకు వాటిని పెంచినట్టు వెల్లడించింది. ఇందులో 3,327 ఆర్టీసీ బస్సులు ఉండగా.. అద్దె బస్సులు 2,032 ఉన్నాయి. మొత్తం ఆర్టీసీ బస్సుల్లో ఇది 51.23 శాతం కావటం విశేషం. ఇక విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులు, వ్యాన్లు, మ్యాక్సీ క్యాబ్‌లు, ఇతర ప్రైవేటు వాహనాలు మరో 6వేలకు పైగా తిప్పినట్టు తెలిపింది. వీటికి అదనంగా మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ సర్వీసులు తిప్పటంతో అవి కూడా సమ్మె ఇబ్బందులను దూరం చేసేందుకు ఉపయోగపడ్డాయని పేర్కొంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా