అలా అయితే ఇప్పుడే ఆర్టీసీ సమ్మె విరమిస్తాం..

25 Oct, 2019 13:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తీవ్రంగా ఖండించారు. టీఎంయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ..‘సీఎం ప్రెస్‌మీట్‌లో వెటకారం మాటలు, అహంకార పూరిత వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగవు. ఆర్టీసీపై కేసీఆర్‌ ఎన్నో ఆరోపణలు చేశారు. సంఘాలు కార్మికుల హక్కుల కోసం ఉంటాయి.  కార్మికులు స్వచ్ఛందంగా చేస్తున్న సమ్మె ఇది. సమ్మె కొనసాగుతుంది. మా డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై పక్క రాష్టాన్ని కూడా చులకన చేసి మాట్లాడటం సరికాదు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది.

చదవండి: ఆర్టీసీ మూసివేతే ముగింపు

రాజకీయ పార్టీలకు అయిదేళ్లకు ఓసారి ఎన్నికలు ఎలా వస్తాయో... ప్రతి రెండేళ్లకు ఒకసారి కార్మిక సంఘాల ఎన్నికలు జరుగుతాయి. కార్మిక చట్టాన్ని కేసీఆర్‌ ఒకసారి చదివి అవగాహన చేసుకోవాలి. ప్రయివేట్‌ బస్సులను కూడా గ్రామీణ ప్రాంతాల్లో తిప్పితే తెలుస్తుంది. దూరప్రాంత ఆర్టీసీ బస్సులు కూడా లాభాల్లో ఉన్నాయి. సమ్మెను రాజకీయ కోణంలో కాకుండా కార్మికుల కోణంలో చూడాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కార్మిక సంఘాలే ఉండవు. కరీంనగర్‌లో చెప్పిన మాటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కట్టుబడి ఉండాలి. సమ్మె విరమించి కార్మికులు విధులకు హాజరు కావాలని కేసీఆర్‌ నిన్న చెప్పినా...ఇప్పటివరకూ ఎవరూ విధుల్లో చేరలేదు.  మా స్వార్థం కోసం పెట్టిన ఒక్క డిమాండ్‌ అయినా ఉంటే...ఇప్పడే సమ్మె విరమిస్తాం. ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే మా డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మె కొనసాగుతుంది.’ అని స్పష్టం చేశారు.

సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం: రాజిరెడ్డి
ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారు. అద్దె బస్సులు లాభాల్లో నడిస్తే ఏడాది చివరికి ఎందుకు నష్టాలు చూపిస్తున్నాయి. కార్మికులకు రూ.50వేల జీతం వస్తుందని ముఖ్యమంత్రి అనడం హాస్యాస్పదంగా ఉంది. ప్రజారవాణా సంరక్షణ కోసమే కార్మికులంతా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాగే ఉంటే సమ్మె కొనసాగుతుంది. సీఎం తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడొద్దు. ప్రయివేట్‌ ప్రకటనతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు మా పోరాటానికి సంబంధం లేదని  అన్నారు.కేసీఆర్‌ చెప్పినవన్నీ అబద్ధాలే..
సమ్మె విషయంలో ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చినవన్నీ అబద్ధాలేనని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్‌ వీఎస్‌ రావు అన్నారు. ఆర్టీసీ కార్మికులకు 60శాతం మాత్రమే ఐఆర్‌ ఇచ్చారన్నారు. ఉన్న నష్టాలకు సంబంధం లేకుండా సీఎం భారీగా చూపించారని, 3వేల కోట్లు అప్పులు ఉంటే వేలకోట్లు ఉన్నాయి అని ఎలా మాట్లాడతారని సూటిగా ప్రశ్నించారు. ఒక‍్క రూపాయి కూడా ఈక్విటీ రూపంలో ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు, అప్పులపై యాజమాన్యంతో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్మికులు, కార్మిక సంఘాల మధ్య ప్రభుత్వం విభేదాలు తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయింది తమ ఉద్యోగాలు తీయించడానికేనా అని ప్రశ్నలు సంధించారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 22వ రోజు కూడా కొనసాగుతోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా