సీపీ వ్యాఖ్యలు బాధించాయి: అశ్వత్థామరెడ్డి

9 Nov, 2019 20:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగర పోలీస్‌ కమిషనర్‌ వ్యాఖ్యలను ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఖండించారు. ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. మావోయిస్టు సంఘాలతో సంబంధాలు ఉన్నందునే చలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి ఇవ్వలేదని సీపీ అంజనీకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ...‘మావోయిస్టలు ఉన్నారంటూ అనవసర ఆరోపణలు చేసి సమ్మెపై ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారు. మావోయిస్టులు ఉన్నారంటూ పోలీస్‌ కమిషనర్‌ వ్యాఖ్యానించడం దురదృష్టకరం. సీపీ వ్యాఖ్యలు మమ్మల్ని బాధించాయి. చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో పాల్గొన్నదంతా కార్మికులే. 

ఎన్ని నిర్బంధాలు ఎదురైనా చలో ట్యాంక్‌బండ్‌ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సహకరించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలకు కృతజ్ఞతలు. మహిళా కండక్టర్ల పాత్ర కీలకం. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు శిరసు వంచి వందనాలు చెబుతున్నాం. అలాగే చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో పోలీసుల దమనకాండను ఖండిస్తున్నాం. సమ్మె విజయవంతం అయ్యేవరకూ  మహిళా సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. పోలీసుల దమనకాండకు నిరసనగా నల్లబ్యాడ్జీలతో రేపు (ఆదివారం) బస్సు డిపోల ఎదుట నిరసన కార్యక్రమం చేపడతాం.’ అని తెలిపారు.

కాగా మావోయిస్టు సంఘాలతో కలిసి ఆర్టీసీ కార్మికులు...పోలీసులపై రాళ్లు విసిరారని, ఈ దాడిలో ఏడుగురు పోలీసులు గాయపడ్డారని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. పోలీసులపై దాడి చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు పెడతామని ఆయన పేర్కొన్నారు.

చదవండి: చాలామంది పోలీసులు గాయపడ్డారు..

మరిన్ని వార్తలు