‘48,533 మంది కార్మికులు ఆర్టీసీ సిబ్బందే’

7 Oct, 2019 23:28 IST|Sakshi

కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మిక సంఘాలు అస్థిత్వాన్ని కోల్పోయాయనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్లు  అస్తిత్వం కోల్పోలేదని ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్‌ అసహనంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆర్టీసీలో యూనియన్లు ఇప్పుడు పుట్టినవి కావని.. ఎప్పటికీ ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల పోరాట చరిత్ర కేసీఆర్‌కు బాగా తెలుసునని అన్నారు.

ఆర్టీసీ ఆస్తులను బినామీలకు అప్పగిస్తారా
‘సీఎం బెదిరింపులకు ఇక్కడెవరూ భయపడరు. సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. 20 శాతం ప్రైవేటు బస్సులను స్టేజ్ క్యారేజీలుగా మార్చితే ఎవరు నడుపుతారు. ఆర్టీసీ ఆస్తులన్నీ మీ బినామీలకు అప్పగిస్తారా. ఇక మీ దోపిడీ చెల్లదు. కార్మికులంతా అప్రమత్తంగా ఉండాలి. సూపర్ వైజర్లకు ఆర్టీసీ జేఏసీ అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలపై పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ప్రజలంతా మీతో అమీ-తుమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 48,533 మంది కార్మికులు ఎప్పటికీ ఆర్టీసీ సిబ్బందే’అన్నారు.

మరిన్ని వార్తలు