ఆర్టీసీ సమ్మె.. నెక్ట్స్‌ ఏంటి? 

2 Nov, 2019 04:25 IST|Sakshi

తదుపరి కార్యాచరణపై ఆర్టీసీ జేఏసీ దృష్టి 

నేడు అఖిలపక్ష నేతలతో భేటీ 

మిలియన్‌ మార్చ్‌ తదితర అంశాలపై చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ తదుపరి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఈ అంశంపై చర్చించేందుకు శనివారం అఖిలపక్ష నేతలతో భేటీ అవుతోంది. కేసు విచారణలో భాగంగా శుక్రవారం హైకోర్టులో జరిగిన వాదనల్లో సమ్మె నివారణకు ఏవైనా పరిష్కార మార్గాలు దొరుకుతాయని అంతా భావించారు. కానీ తదుపరి విచారణ ఈనెల ఏడో తేదీకి వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తనంతట తానుగా సమ్మె ముగింపునకు చర్యలు తీసుకునే అవకాశం లేదని కార్మికులు భావిస్తున్నారు. ఫలితంగా తదుపరి కోర్టు విచారణ జరిగే వరకు సమ్మె కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో సిద్ధం చేసిన కార్యాచరణ పూర్తి కావటంతో కొత్త ప్రణాళిక రూపొందించాలని జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా శనివారం అఖిలపక్ష నేతలతో సమావేశమై చర్చించాలని నిర్ణయించింది. మరోవైపు శనివారం సీఎం మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇచ్చి పెద్ద సంఖ్యలో రూట్లు కేటాయించే అంశం ఉంటుందని చెబుతున్నారు. అదే నిర్ణయం వెలువడితే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు నిర్ణయించారు. అలాగే మిలియన్‌ మార్చ్‌ నిర్వహించే అంశాన్ని యోచిస్తున్నామని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించిన నేపథ్యంలో, శనివారం సమావేశంలో దీనిపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

అధికారులూ అబద్ధాలు ఆపి.. సమ్మెకు రండి
ఆర్టీసీలో పనిచేస్తూ సంస్థకు నష్టం జరిగేలా అధికారులు హైకోర్టుకు తప్పుడు వివరాలను అందించటం సిగ్గుచేటని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మండిపడ్డారు. ఆర్టీసీ ఉనికే ప్రశ్నార్థకంలో పడుతున్న నేపథ్యంలో అధికారులు కూడా బయటకు వచ్చి సమ్మెలో పాల్గొనాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైకోర్టు వెలుపల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తదితరులు విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్‌ శాఖ నుంచి ఆర్టీసీకి నిధులు రావాల్సిన అవసరం లేదంటూ ఆర్టీసీ అధికారులు మున్సిపల్‌ శాఖకు అనుకూలంగా మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అధికారులు వాస్తవాలు వదిలేసి ప్రభుత్వం చెప్పినట్టుగా కోర్టుకు వివరాలు సమర్పిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారులు తప్పుడు వివరాలు ఇస్తున్నారని జడ్జి గుర్తించి అక్షింతలు వేసినా వారిలో మార్పు రాకపోవటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు