ప్రభుత్వం బెదిరించినా భయపడం

5 Oct, 2019 16:42 IST|Sakshi

తెలంగాణ ఆర్టీసీ జేసీఏ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి

సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు సమ్మెను కొనసాగిస్తామని తెలంగాణ ఆర్టీసీ జేసీఏ కన్వీనర్‌, టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి పునరుద్ఘాటించారు. హయత్‌నగర్‌లో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులని కలిసి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమ్మె చేస్తున్న కార్మికులపై చర్యలు తీసుకోవడానికి తమవి ఎవరి దయాదాక్షిణ్యాల మీద వచ్చిన ఉద్యోగాలు కావని అన్నారు. విధులకు హాజరు కానీ కార్మికులను తొలగించాలనుకుంటే మొదట తనను ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి రోజు మంచి ప్రణాళికతో శాంతియుతంగా సమ్మెను చేస్తామని తెలిపారు.

ప్రభుత్వ బెదిరింపులకు భయపడం
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక కొత్త బస్సు పెరగలేదు, ఒక్క రూటు పెంచలేదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని టీఎస్‌ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తెలిపింది. సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తామని ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు భయపడబోమని ప్రకటించింది. త్రిసభ్య కమిటీకి ఎటువంటి అధికారాలు ఇవ్వకుండా తూతూ మంత్రంగా ప్రభుత్వం చర్చలు జరిపిందని వెల్లడించింది. సమ్మెలో భాగంగా తదుపరి కార్యాచరణపై జేఏసీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. (చదవండి: ఆర్టీసీని చంపొద్దు.. బతికించండి)

జేఏసీ కార్యాచరణ
ఆదివారం ఉదయం 8 గంటలకు అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్‌ యూనియన్లు, విద్యార్థి సంఘాల మద్దతు కోరుతూ లేఖల సమర్పణ
ఆదివారం ఉదయం 11 గంటలకు ట్రేడ్‌ యూనియన్లతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం
ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద కార్మికుల కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ
సోమవారం ఉదయం 8 గంటలకు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళి
సోమవారం ఉదయం 8 గంటలకు ఇందిరా పార్క్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం

మరిన్ని వార్తలు