‘ఆర్టీసీ’లో పెట్రోల్‌ బంక్‌లు

9 Jul, 2019 10:12 IST|Sakshi
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు ఆర్టీసీ బస్టాండ్‌లో హిందుస్థాన్‌ కార్పొరేషన్‌ వారు నిర్మాణం  చేపట్టనున్న బంక్‌ స్థలం ఇదే

ఆదాయం పెంచేందుకు ఇతర మార్గాలు 

నష్టాల్లో నుంచి బయటపడేందుకు తిప్పలు    

సాక్షి, మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థకి ప్రజా రవాణాల్లో మంచి గుర్తింపు ఉంది. దీంతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను కాపాడుకునేందుకు సంస్థ ఆదాయం కోసం ఇతర మార్గాలను అన్వేషిస్తుంది. ఆర్టీసీకి టికెట్ల రూపంలో వచ్చే రోజువారి ఆదాయం దాని నిర్వహణకు సరిపోవడం లేదు. ఈ నేపధ్యంలో నష్టాలు, కష్టాల నుంచి బయటపడేందుకు ఇతర ప్రణాళికలను రూపొందించింది. దీనిలో భాగంగానే ఆర్టీసీ సంస్థ పెట్రోల్‌ బంక్‌లను ఏర్పాటు చేసి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ఆ అధికారులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆర్టీసీ సంస్థకు ఎంతో విలువైన ఖాళీ స్థలాలున్నాయి. ఆవి ఎంతో కాలంగా నిరుపయోగంగానే ఉంటున్నాయి. కొన్ని చోట్ల కాంప్లెక్స్‌లను నిర్మించి అద్దెకు ఇచ్చినప్పటికీ మరి కొన్ని చోట్ల వ్యాపారాలకు అనువైన ఖాళీ స్థలాలున్నాయి. అవి ప్రధాన కేంద్రాల్లో ఉండటంతో మంచి డిమాండ్‌ కూడా వస్తుంది. ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాలలో వ్యాపారాలకు, మల్టీప్లెక్స్‌లకు అనుకూలంగా ఉన్నాయి.

నల్లగొండ రీజియన్‌ పరిధిలో యాదగిరిగుట్ట, సూర్యాపేట, కోదాడ, నల్లగొండ, నార్కట్‌పల్లి, దేవరకొండ, మిర్యాలగూడ డిపోలలో సంస్థకు విలువైన ఖాళీ స్థలాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొన్ని ఆర్టీసీ బస్టాండుల్లో వ్యాపార సముదాయాలు, మల్టీ కాంప్లెక్స్‌లు ఆర్టీసీ సంస్థకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్టీసీ బస్టాండుల్లో ప్రస్తుతం నడుస్తున్న వ్యాపార సముదాయాలు, సైకిల్‌ స్టాండ్‌ల ద్వారా ప్రతి నెలా 50 లక్షల రూపాయల పైచిలుకు ఆదాయం వస్తుంది. కాగా ఆయా డిపోల పరిధిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ఆర్టీసీ సంస్థ సిద్ధంగా ఉంది. దీంతో ఆర్టీసీ సంస్థకు రాబోయే రోజుల్లో వాణిజ్య పరంగా మంచి ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో...
ఆర్టీసీ సంస్థ నల్లగొండ రీజియన్‌ పరిధిలో గల నల్లగొండ, నార్కట్‌పల్లి, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట డిపోల పరిధిలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లలో ఖాళీ స్థలాల్లో పెట్రోల్‌ బంక్‌లను ఏర్పాటు చేసేందుకు అర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అనువైన స్థలాల్లో ఆయిల్‌ కంపెనీలకు ప్రతిపాదనలు పంపించింది. సదరు ఆయిల్‌ కంపెనీలు కూడా పెట్రోల్‌ బంక్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. బంక్‌లను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను కూడా ఆయిల్‌ కంపెనీ యాజమాన్యాలు పరిశీలించాయి. తర్వాత నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లను కూడా జారీ చేసింది. త్వరలోనే బంక్‌ల నిర్మాణాలను చేపట్టనున్నారు.

బంకుల నిర్వహణ బాధ్యతలను మాత్రం ఆర్టీసీ సంస్థనే చూసుకుంటుంది. వచ్చిన లాభాల్లో సంస్థకు వాటా ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్‌పల్లి, కోదాడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట డిపోల పరిధిలో 13 పెట్రోల్‌ బంక్‌లను ఏర్పాటు చేయనున్నారు. హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కంపెనీ బంక్‌లు 10, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు చెందిన మూడు బంక్‌లను ఏర్పాటు చేయనున్నారు. హెచ్‌పీసీఎల్‌ బంకులు ఏర్పాటు చేసే ప్రాంతాలు చౌటుప్పల్, దేవరకొండ, హుజూర్‌నగర్, రాజాపేట, సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్, తిరుమలగిరి, యాదగిరిగుట్ట, రామన్నపేట, కట్టంగూర్, మేళ్లచెరువు. ఐఓసీ పెట్రోల్‌ బంక్‌లు నల్లగొండ, తుంగతుర్తి, భువనగిరి ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు బంక్‌ల యాజమాన్యం ముందుకు రాగా ఆర్టీసీ సంస్థ నుంచి వీటి నిర్మాణానికి అనుమతి కూడా వచ్చింది. అయితే వీటికి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ రాగానే నిర్మాణాలను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.  

మల్టీప్లెక్స్‌ల నిర్మాణానికి...
నార్కట్‌పల్లి, నల్లగొండ, సూర్యాపేట, దేవరకొండ ఆర్టీసీ డిపోల్లో అనువైన ఖాళీ స్థలాలు ఉండటంతో మల్టీప్లెక్స్‌ నిర్మాణాలను చేపట్టనున్నారు. నార్కట్‌పల్లి డిపోలో భారీగా మార్పులు చేయనున్నారు. ఈ డిపోల్లో ఆర్టీసీ క్వార్టర్స్‌తో పాటు ఖాళీ స్థలం కూడా అధికంగా ఉంది. శిథిలావస్థలోకి చేరుకున్న క్వార్టర్లను కూల్చివేసి రోడ్డు వైపు ఉన్న ముందు భాగంలో వ్యాపార సముదాయాలు, వెనుక భాగంలో డిపోను నిర్మించేందుకు ప్లానింగ్‌ చేస్తున్నారు. దేవరకొండ డిపోలో కూడా ఇదే తరహాలో మార్పులు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. 

 మరో 8 బంకులకు ప్రతిపాదనలు 
మరో 8 చోట్ల బంక్‌లను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలను పంపించారు. చిట్యాల, దామరచర్ల, మాల్, చందంపేట, మునుగోడు, మర్రిగూడ, గుండాల, వలిగొండ ప్రాంతాల్లో పెట్రోల్‌ బంక్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను పంపించారు. ఈ ప్రాంతాల్లో కూడా బంక్‌లు అవసరమని గుర్తించారు. ఆయిల్‌ కంపెనీలు కూడా ముందుకు వస్తే వారికి స్థలం కేటాయించేందుకు ఆర్టీసీ సంస్థ సిద్ధంగా ఉందని తెలిసింది. 

ఆదాయ మార్గాలను పెంచేందుకే... 
ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను గట్టెక్కించేందుకు ఇతర ఆదాయ మార్గాలపై దృష్టిని కేంద్రీకరించాం. అందులో భాగంగానే ఆర్టీసీ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాల్లో పెట్రోల్‌ బంక్‌ల నిర్మాణం, వ్యాపార సముదాయాలు, మల్టీప్లెక్స్‌ల నిర్మాణాలను చేపడుతున్నాం. అయితే 10 హిందూస్థాన్‌ పెట్రోలియం, 3 ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ బంక్‌లకు అప్రూవల్‌ కూడా మంజూ రైంది. వీటికి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ రాగానే బంకుల యాజమాన్యాలు నిర్మాణాలను చేపట్టనున్నారు.    
                                                                – చెరుకుపల్లి వెంకన్న, ఆర్టీసీ ఆర్‌ఎం, నల్లగొండ

మరిన్ని వార్తలు