సమ్మెలో పాల్గొంటే డిస్మిస్‌

4 Oct, 2019 16:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె అన్యాయమని, సమ్మెలో పాల్గొనే కార్మికులను డిస్మిస్‌ చేస్తామని తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ శర్మ హెచ్చరించారు. ఈమేరకు శుక్రవారం ఆయన అన్ని డిపోల అధికారులకు నోటీసు జారీ చేశారు. కార్మికులందరూ సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. విధులకు రాకుండా సమ్మెలో పాల్గొంటే వేటు తప్పదన్నారు. డిస్మిస్ అయిన ఉద్యోగుల స్థానంలో వెంటనే కొత్త వాళ్లను తీసుకుంటామని తెలిపారు. సమ్మెకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, 2100 ప్రైవేట్ బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 20 వేల స్కూల్ బస్సులకు పర్మిట్లు ఇచ్చి  పొలీస్ బందోబస్తు మధ్య వాటన్నింటినీ నడుపుతామన్నారు. సమ్మె ప్రభావం లేకుండా,  ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.

సమ్మె వాయిదా వేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలను కోరినట్టు త్రిసభ్య కమిటీ సభ్యుడు సోమేశ్‌కుమార్ తెలిపారు. ఆర్టీసీపై ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందజేస్తామని, సమ్మె నివారణకు శాఖ పరంగా చేయాల్సిందంతా చేశామన్నారు. కార్మికుల 26 డిమాండ్లపై సమగ్ర నివేదిక ఇవ్వడానికి సమయం ఇవ్వాలని కోరామని, రిపోర్ట్‌ సమర్పించేందుకు సమయం పడుతుందని చెప్పారు.

సోమేశ్‌కుమార్ కమిటీకి గడువు ఇచ్చి, ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి రావాలని త్రిసభ్య కమిటీ సభ్యుడు రామకృష్ణారావు కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసికి రూ. 1495 కోట్లు సహకారం అందిస్తే, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రూ.3303 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడం జరిగిందన్నారు. సంస్థకు మరింతగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గత రెండేళ్లుగా ఆర్టీసీకి బడ్జెట్‌లో కేటాయించిన దానికంటే కొంచెం తక్కువే ఇచ్చామని, ఆర్టీసీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోందన్నారు. నిశితంగా, లోతుగా పరిశీలించి నివేదిక ఇస్తామని.. ప్రజలకు ఇబ్బంది కాకుండా సమ్మె వాయిదా వేయాలని కార్మిక సంఘాలను కోరారు. సమ్మెతో
సంస్థకు ఆర్ధిక ఇబ్బందులు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. (చదవండి: బస్సొస్తదా.. రాదా?)

ఆర్టీసీ సమ్మె ప్రయాణికుల ఇక్కట్లు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Poll
Loading...
మరిన్ని వార్తలు