చార్జీలు పెంచాల్సిందే!

8 May, 2019 02:00 IST|Sakshi

30% టికెట్‌ ధరలు పెంచాలని ఆర్టీసీ అధికారుల ప్రతిపాదనలు

ఇలాగైతే ప్రజా వ్యతిరేకత వస్తుందన్న ఆర్టీసీ ఎండీ 

కనీసం 15 శాతమైనా పెంచితేనే స్వల్ప ఊరటన్న అధికారులు 

ఎన్నికల కోడ్‌ తర్వాత సీఎం ముందుకు పెంపు అంశం 

ఇది అమలైతే జనం జేబుపై రూ.550 కోట్ల వార్షిక భారం 

2016 తర్వాత టికెట్‌ ధరలు పెంచని సర్కారు 

ఈలోగా 37.50% డీజిల్‌ భారం పెరగడంతో మరింత నష్టాల్లోకి సంస్థ 

సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆర్టీసీ.. ఊపిరి పీల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సమస్యల నుంచి కాస్తయినా బయటపడేందుకు మళ్లీ టికెట్ల ధరలు పెంచాలని యోచిస్తోంది. దాదాపు రూ.3,250 కోట్ల నష్టాల్లో ఉన్న సంస్థ జీతాలు చెల్లించేందుకు కూడా శక్తి లేక అంతర్గత అభివృద్ధి పనులకు దాదాపు ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది. కచ్చితంగా చేయాల్సిన పనులకు నిధులు లేక చివరకు సిబ్బంది నుంచి చందాలు వసూలు చేసుకోవాల్సిన దుస్థితిలోకి చేరింది. ఇలా అయితే ప్రగతి రథం ఇక ముందుకు కదలటం సాధ్యం కాదని తేల్చిన అధికారులు ఇక టికెట్‌ చార్జీల పెంపే శరణ్యమని తేల్చారు. ఇదే విషయాన్ని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ ముందుంచారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున, అది ముగియగానే ప్రభుత్వానికి ప్రతిపాదిద్దామని ఆయన పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. టికెట్‌ ధరలను 15% మేర పెంచాలని, ఇంతకు ఏమాత్రం తగ్గకూడదనే ప్రతిపాదనల్లో చేర్చారు. దీనికి ప్రభుత్వం పచ్చజెండా ఊపితే.. దాదాపు మూడేళ్ల తర్వాత టికెట్‌ ధరలకు రెక్కలొచ్చినట్టవుతుంది. అధికారులు ప్రతిపాదించినట్టుగా 15% మేర టికెట్‌ ధరలు పెరిగితే జనంపై రూ.550 కోట్ల వార్షిక భారం పడనుంది. 

30శాతం పెంచితేనే! 
ఇటీవల ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఇన్‌చార్జి  ఎండీ సునీల్‌ శర్మ సమీక్ష నిర్వహించారు. సంస్థ ఆర్థిక పరిస్థితిపై ఇందులో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికారులు ముక్తకంఠంతో టికెట్‌ చార్జీల పెంపు అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయం అందకపోతుండటం, గతంలో పెంచిన జీతాల భారాన్ని సంస్థ మోయలేకపోతుండటం, వేతన సవరణలో భాగంగా కొత్తగా ప్రకటించిన ఐఆర్‌ భారం మీద పడటంతో సంస్థ కుదేలైందని పేర్కొన్నారు. 2016లో చార్జీలను 10% పెంచిన తర్వాత మళ్లీ సవరించలేదని, అదే సమయంలో డీజిల్‌ ధరల భారం మాత్రం 37.5% మేర పెరిగిందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల ముగిసేనాటికి నష్టాలు రూ.687 కోట్లకు చేరుకున్నాయని, మార్చి నెల నష్టాలను జోడిస్తే అది రూ.750 కోట్లను చేరుకుంటుందని వెల్లడించారు. ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయం నామమాత్రంగానే ఉండటం, నష్టాలు మాత్రం భారీగా పెరుగుతుండటంతో ఛార్జీలు పెంచక తప్పని స్థితి నెలకొందన్నారు. వీటిని పరిశీలించిన ఎండీ.. ప్రభుత్వానికి నివేదిస్తానని, సమగ్ర వివరాలతో కూడిన నివేదిక అందజేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం నష్టాలు 3వేల కోట్లను మించిపోవటం, 2016 నుంచి ఇప్పటి వరకు డీజిల్‌ భారం 37.50% పెరిగినందున బస్సు చార్జీలను కూడా 30% పెంచితేనే వెసులుబాటు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సగటున ఆర్టీసీ సాలీనా రూ.700 కోట్లకు పైగా నష్టం నమోదవుతోందని, త్వరలో ఉద్యోగుల వేతనాలు సవరించాల్సి ఉండటం, గత వేతన సవరణ బకాయిలు చెల్లించాల్సి ఉన్నందున వార్షికంగా వేయి కోట్ల ఆదాయం పెరగాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇది జరగాలంటే చార్జీలను 30 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఇంతపెద్దమొత్తం పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఎండీ పేర్కొన్నట్టు సమాచారం. దీంతో కనీసం 15 శాతానికి తగ్గకుండా టికెట్‌ ధరలను సవరించాలని అధికారులు కోరారు. అప్పుడు వార్షికాదాయం రూ.500 కోట్లు పెరుగుతుందని, అప్పటికీ రూ.200 కోట్ల నష్టాలు తప్పవని పేర్కొన్నారు. దీంతో విషయాన్ని ప్రభుత్వానికి నివేదిద్దామని, ఎన్నికల కోడ్‌ తర్వాత ప్రతిపాదన పంపుతానని, అక్కడి నుంచి వచ్చే ఆదేశం మేరకు ఏర్పాట్లు చేద్దామని ఎండీ పేర్కొన్నట్టు సమాచారం.  

ఇదీ పరిస్థితి! 

  • ఉమ్మడి రాష్ట్రంలో 2013లో టికెట్‌ చార్జీలు పెరిగాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వెంటనే చార్జీలు పెంచకుండా ప్రభుత్వం జనంపై భారం మోపకుండా జాగ్రత్తపడింది. 2015లో ఏపీలో 10% టికెట్‌ ధరలు పెరిగినా ఇక్కడ పెంచలేదు. 2016లో తప్పనిసరి పరిస్థితుల్లోనేనంటూ ప్రభుత్వం 10% ధరలు పెంచింది. దానివల్ల జనంపై సాలీనా రూ.286 కోట్ల భారం పడింది. 
  • ప్రస్తుతం ఆర్టీసీ లెక్కల ప్రకారం రోజుకు రూ.9.5 కోట్లు ఆదాయం సమకూరుతుండగా.. ఖర్చు మాత్రం రూ.11.50 కోట్లుగా ఉంటోంది. అంటే రోజుకు రూ.2 కోట్ల నష్టం వాటిల్లుతోంది. 
  • తెలంగాణ వచ్చాక ఓ ఏడాదిపాటు కరీంనగర్, హైదరాబాద్‌ జోన్ల పరిధిలో లాభాలు నమోదయ్యాయి. కానీ ఆ తర్వాత ఆర్టీసీని పట్టించుకునేవారు లేక ఆ ఉత్సాహం కొరవడింది. దాదాపు మూడేళ్లపాటు.. రిటైర్ట్‌ అధికారి ఎండీగా ఉండటం, ఆ తర్వాత ఇన్‌చార్జులతోనే సంస్థను నడపడంతో ఆర్టీసీని గట్టెక్కించేందుకు వినూత్నంగా చర్యలు తీసుకోలేకపోయారు. 2015లో సీఎం ఆర్టీసీని సమీక్షించి ఇన్నోవేటివ్‌గా ఆలోచించాలంటూ చేసిన ఆదేశాన్ని పట్టించుకోలేదు. 
  • కొత్త బస్సులు కొనేందుకు డబ్బులు లేక 2వేల డొక్కు బస్సులే దిక్కవుతున్నాయి. ఇప్పటికీ వెయ్యి గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవటం గమనార్హం. 
  • ఎక్కువ మైలేజీ (కేఎంపీఎల్‌) విషయంలో దేశంలోనే తెలంగాణ ఆర్టీసీ ఉత్తమ రవాణా సంస్థగా ఉంది. అది అధమంగా ఉండి ఉంటే డీజిల్‌ ఖర్చు మరింత ఎక్కువగా ఉండేది.  

గతంలో మంత్రుల నోటా! 
ఆర్టీసీ ఆర్థికస్థితిని బట్టి టికెట్‌ చార్జీల ధరలను సవరించాల్సి ఉంటుందని గతం లో పలుమార్లు మంత్రులు పేర్కొన్నారు. 2016 లో చార్జీలు సవరించేప్పుడు కూడా ఇదే విషయా న్ని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పెం పు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2016 లో 10% టికెట్‌ ధరలను పెంచినా స్థూలంగా ఆర్టీసీకి 8% మేర మాత్రమే ఆదాయం పెరిగిందని అధికారులు చెబుతున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు