రండి.. రండి.. దయచేయండి!

1 Jan, 2020 02:22 IST|Sakshi

కొత్త సంవత్సరంలో ‘స్మైలీ ఆర్టీసీ’

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీకి కొత్త రూపు ఇస్తున్న ప్రభుత్వం, సిబ్బంది వ్యవహారశైలిపై కూడా దృష్టి సారించింది. 2020 కొత్త సంవత్సరం ఆరంభం నుంచే సిబ్బంది ప్రయాణికులను చిరునవ్వుతో పలకరిస్తూ, వారిపట్ల మర్యాదగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు.  ఈ విషయంలో వారికి శిక్షణ తరహాలో సూచనలు కూడా అందజేయాలని నిర్ణయించారు. 
 
కొత్త ఆప్రాన్‌పై స్మైలీ ఎమోజీ..
సీఎం ఆదేశం మేరకు మహిళా కండక్టర్లకు కొత్త యూనిఫామ్‌ ఇవ్వాలని నిర్ణయించిన నేప థ్యంలో.. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నా రు. మహిళా సిబ్బంది ధరించే మెరూన్‌ రంగు ఆప్రాన్‌ జేబుపై పెద్ద సైజులో స్మైలీ ఎమోజీ ముద్రించాలని నిర్ణయించారు. ఆ ఆప్రాన్‌ జేబుపై చిరునవ్వు చిందించే ఎమోజీలు సాక్షాత్కరించనున్నాయి.

‘క్యాపిటల్‌ ప్యాసింజర్‌’తిరిగి రావాలి..
‘ఆర్టీసీ అనగానే ప్రయాణికులకు ఓ నమ్మకం. కానీ కొన్ని కారణాలతో కొందరు ప్రయాణికులు సంస్థకు దూరమయ్యారు. సిబ్బంది వ్యవహారం కూడా దీనికి ఓ కారణం. సిబ్బంది వ్యవహారశైలిలో మంచి మార్పు అవసరం. కొత్త సంవత్సరంలో వారిలో ఆ మార్పు కనిపిస్తుంది, ప్రయాణికులు దాన్ని గుర్తిస్తారు’– రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌  
‘ఆర్టీసీ’ లో 46 రిఫరల్‌ ఆస్పత్రులు
తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి అనుబంధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 46 ఆస్పత్రులను రిఫరల్‌ ఆస్పత్రులుగా గుర్తిస్తూ ఆర్టీసీ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే వైద్య పరీక్షలకు 3 డయాగ్నస్టిక్‌ సెంటర్లను కూడా గుర్తించింది. ఈ ఆస్పత్రుల్లో 28 హైదరాబాద్‌లో ఉండగా.. వరంగల్‌లో 6, కరీంనగర్‌లో 5, నిజామాబాద్‌ లో 2, జగిత్యాల, ఖమ్మం, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నార్కెట్‌పల్లిల్లో 1 చొప్పున ఉన్నాయి.

మరిన్ని వార్తలు