కాసుల గలగల

22 Jan, 2020 11:54 IST|Sakshi
వనపర్తి ఆర్టీసీ డిపోలో సంబరాలు చేసుకుంటున్న ఉద్యోగులు

ఆర్టీసీకి కలిసివచ్చిన మున్సి‘పోల్స్‌’  

డిపో చరిత్రలో ఒక్కరోజే రూ.22లక్షల ఆదాయం  

8రోజుల్లో రూ.143.52 లక్షలు  

వనపర్తిటౌన్‌:  వనపర్తి ఆర్టీసీకి సంక్రాంతి కలిసి వచ్చింది. ఏన్నాడు లేని రీతిలో ఆదాయం ఆర్టీసీకి సమకూరింది. ఎనిమిది రోజుల్లో రూ.143.52 లక్షల ఆదాయం రాబట్టింది. రోజువారీగా వచ్చే ఆదాయం కంటే  అదనంగా ఆదాయం సమకూరడంతో పాటుగా ఈనెల 20వ తేదీ ఒక్కరోజునే రూ.22 లక్షల ఆదాయం సమకూరింది. ఒక్కరోజు వనపర్తి ఆర్టీసీ రూ.22లక్షల ఆదాయం రాబట్టడం డిపో చరిత్రలోనే ఇది తొలిసారి అని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.  సంక్రాంతి పండుగ సందర్భంగా రోజువారి కంటే అదనంగా, పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను అధికంగా చేరవేయడంతో ఈ ఆదాయం సమకూరింది. పండుగకు ముందు, తిరుగు ప్రయాణాల్లో ఆదాయం సమకూర్చుకునేందుకు ఈనెల 11నుంచి ఆర్టీసీ అదనంగా 160 ట్రిప్పులు బస్సు సర్వీసులునడిపింది. ప్రత్యేక బస్సులను ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నడిపేందుకు ఆర్టీసీ తీసుకున్న చొరవతో అదనపు ఆదాయం ఆర్జించింది. రోజు వచ్చే ఆదాయం రూ.14.50 లక్షలు కాగా, పండుగ సీజన్‌లో రూ.17.94 లక్షల ఆదాయం వచ్చింది. ఇలా ఈనెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రూ.కోటి 43లక్షల 52వేలు వసూలు చేసింది. 

డిపోలో సంబరాలు  
వనపర్తి ఆర్టీసీ డిపోలో మంగళవారం సంబరాలు చేసుకున్నారు. ఈనెల 20వ తేదీన ఒక్కరోజే రూ.22లక్షల ఆదాయం రావడంతో అధికారులు, ఉద్యోగులు స్వీట్లు తినిపించుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమష్టి కృషి వల్లే     ఆర్టీసీకి రీజియన్‌లో అత్యధిక ఆదాయం సమకూరిందని డీఎం దేవదానం, ఏడీఎం దేవేందర్‌గౌడ్‌ అన్నారు.

>
మరిన్ని వార్తలు