రథచక్రాలు రోడ్డెక్కేనా?

11 May, 2020 13:10 IST|Sakshi
లాక్‌డౌన్‌తో డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

డిపోల్లో సిద్ధంగా ఉన్న బస్సులు

ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూపు

లాక్‌డౌన్‌తో ఆర్టీసీకి రోజు     రూ.90లక్షల నష్టం

ఆదిలాబాద్‌టౌన్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆర్టీసీ రథచక్రాలు డిపోలోనే లాక్‌డౌన్‌ అయ్యాయి. 50 రోజులుగా బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో ఆర్టీసీకి కోట్ల రూపాయల నష్టం సంభవించింది. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు ఎప్పుడు ప్రారంభమవుతాయని ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పట్టడం, జిల్లాలో కొత్త కేసులు నమోదు కాకపోవడంతో లాక్‌డౌన్‌ వేళల్లో సడలింపును ఇచ్చిన విషయం తెలిసిందే. దుకాణ సముదాయాలు తెరుచుకున్నాయి. మున్సిపల్‌ పరిధిలో 50 శాతం దుకాణాలు సరి, బేసి విధానంలో కొనసాగేలా చర్యలు చేపట్టారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగేలా చూస్తున్నారు. కాగా ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం సేవలు ప్రారంభమయ్యాయి. ఇక రవాణా వ్యవస్థనే ప్రారంభం కావాల్సింది. అయితే ఆర్టీసీ సిబ్బంది బస్సులకు చిన్నపాటి మరమ్మతు చేసి వాటిని సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే రోడ్డెక్కిచ్చేలా చర్యలు చేపడుతున్నారు. డ్రైవర్లను సైతం అందుబాటులో ఉంచుతున్నారు.

రీజియన్‌లో..
ఆదిలాబాద్‌ రీజియన్‌లో మొత్తం 625 బస్సులు ఉన్నాయి. ఇదివరకు రోజు 2 లక్షల 50వేల కిలోమీటర్లు బస్సులు తిరిగేవి. 3 లక్షల జనాలను వారి గమ్యస్థానాలకు చేరవేసేవి. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ఆయా డిపోలకే పరిమితం అయ్యాయి. రీజియన్‌ పరిధిలో ఆరు డిపోలు ఉన్నాయి. ఆదిలాబాద్‌ డిపో 137 బస్సులు ఉండగా, వీటిలో 54 అద్దె బస్సులు ఉన్నాయి. భైంసా డిపోలో 87 బస్సులు ఉండగా వీటిలో 40 అద్దెవి ఉన్నాయి. నిర్మల్‌లో 145 బస్సు లు ఉండగా వీటిలో 69 అద్దెవి ఉన్నాయి. ఉట్నూర్‌ డిపోలో 34 బస్సులకు గాను వీటిలో 7 అద్దెవి ఉన్నాయి. మంచిర్యాలలో 141 బస్సులు ఉండగా 59 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ఆసిఫాబాద్‌లో 89 బస్సుల్లో 20 అద్దె బస్సులు ఉన్నాయి. 

విధుల్లో సిబ్బంది
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజారవాణా వ్యవస్థ స్తంభించింది. డిపోలకే పరిమితమైన బస్సుల పనితీరును సిబ్బంది పరిశీలించడంతోపాటు బ్యాటరీలను ఎప్పటికప్పుడు చార్జింగ్‌ చేస్తున్నారు. ఇందుకోసం ఎలక్ట్రీషియన్లు, మెకానిక్‌లు ప్రతిరోజు విధుల్లో ఉంటున్నారు. అత్యవసర సేవల కోసం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో దాదాపు 25 మంది డ్రైవర్లను ప్రతిరోజు అందుబాటులో ఉంచారు. మిగతా డిపోల పరిధిలో రోజుకు పది మంది చొప్పున డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సూపర్‌వైజర్లు కూడా వి ధుల్లో ఉంటున్నారు. ఇంజన్లు, ఏసీ పనితీరు, టై ర్లలో గాలిని పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏ క్ష ణంలో ఆదేశాలు వచ్చినా బస్సులను బయటకు తీ యడానికి సంసిద్ధులవుతున్నారు. కండక్టర్లకు కూడా ఏ క్షణంలోనైనా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. 

కోలుకునే లోపే
సమ్మె నష్టాల నుంచి కోలుకుంటున్న సమయంలో ఆర్టీసీ కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌తో నష్టాల్లోకి వెళ్లింది. ప్రస్తుత పరిస్థితి కారణంగా భారీ స్థాయిలోనే ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. ఆదిలాబాద్‌ రీజియన్‌లో 625 బస్సులు ఉన్నాయి. రోజుకు రీజియన్‌కు రూ.80 లక్షల నుంచి రూ.90లక్షల ఆదాయం వచ్చేది. కరోనా వైరస్‌ నేపథ్యంలో కోట్ల రూపాయల్లో ఆర్టీసీ నష్టాల్లో వెళ్లిపోయింది. అయితే త్వరలోనే బస్సులు రోడ్డెక్కుతాయనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. సీటుకు ఒకరు చొప్పున కూర్చొని భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో మరోసారి ఆర్టీసీ చార్జీలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కితే సామాన్య ప్రజల కష్టాలు కొంతమేర తీరుతాయని పలువురు పేర్కొంటున్నారు.

బస్సులను కండీషన్‌లో ఉంచుతున్నాం
డిపోలకు పరిమితమైన బస్సులు కండీషన్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసర సేవల కోసం డ్రైవర్లు, మెకానిక్‌లు, కార్మికులను అందుబాటులో ఉంచుతు న్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే బస్సులను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాం.       – విజయ్‌భాస్కర్, ఆర్టీసీ ఆర్‌ఎం    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా