టీఎస్‌ ఆర్టీసీలో తాత్కాలిక నియామకాలకు నోటిఫికేషన్‌

13 Oct, 2019 19:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సులను పూర్తి స్థాయిలో నడపాలని ముఖ్యమంత్రి  కేసీఆర్‌ ఆదేశిం చిన నేపథ్యంలో తాత్కాలిక పద్ధతిలో నియామకాలకు సంబంధించి టీఎస్‌ ఆర్టీసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ కేటగిరీల్లో నియమించుకునే వారికి చెల్లించాల్సిన మొత్తాలను అందులో పేర్కొంది. రోజువారీ ప్రాతిపదికన ఇంకా అదనంగా డ్రైవర్లు, కండక్టర్లను తీసుకోవడానికి ఆర్టీసీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపిక చేసిన అభ్యర్థులకు రోజువారీగా డ్రైవర్‌కు రూ.1500, కండక్టర్‌కు రూ.1000 చొప్పున చెల్లించనుంది. 

అలాగే రిటైర్డ్‌ ట్రాఫిక్‌, మెకానికల్‌ సూపర్‌వైజర్స్‌కు రోజువారీ రూ.1500, ఆయా డిపోలో రోజుకు రూ.1000 చొప్పున రిటైర్డ్ మెకానిక్స్‌, శ్రామిక్స్‌ల‌తో పాటు ఎలక్ట్రిషన్స్‌, టైర్‌ మెకానిక్స్‌, క్లరికల్‌గా పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులే కాక ఇతర శాఖల్లో ప‌ని చేసిన డ్రైవ‌ర్స్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆర్టీసీకి చెందిన ఓల్వో / ఏసీ / మల్టీ యాక్సిల్స్‌ బస్సులను నడిపడానికి  అనుభవం ఉన్న డ్రైవర్స్‌, మెకానిక్స్‌ల నుంచి కూడా దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఏసీ బస్సులు నడిపే డ్రైవర్స్‌, మెయింటినెన్స్‌ చేసే మెకానిక్‌కు రోజువారీగా రూ.2000 చొప్పున చెల్లించనుంది. 

రోజువారీ పద్ధతిలో ఐటీ ట్రైనర్‌గా తీసుకున్న సాప్ట్‌వేర్‌ నిపుణులకు రూ.1500 ఇవ్వనుంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ సమీప డిపో మేనేజర్‌ లేదా మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌స్పెక్టర్లు, జిల్లా రవాణా అధికారులను సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు టీఎస్‌ ఆర్టీసీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఇప్పటికే తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను నియమించిన విషయం తెలిసిందే. మరోవైపు తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తొమ్మిదో రోజు కూడా కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు