రోడ్డెక్కిన ప్రగతి చక్రం

20 May, 2020 08:16 IST|Sakshi

జిల్లాలనుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభం

బస్సుల్లో భౌతికదూరం పాటించేలా చర్యలు

మాస్క్‌ ఉంటేనే టికెట్‌ బస్సుల శానిటైజేషన్‌

పికెట్‌ డిపో నుంచి రెండే సర్వీసులు  

మారేడుపల్లి: రాష్ట్రంలోని పలు జిల్లాలకు బస్సులు నడపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయడంతో మంగళవారం నుంచి బస్సులు రోడ్డెక్కాయి. దీంతో ప్రయాణికులు ఉదయం 5 గంటల నుంచే పెద్ద సంఖ్యలో జేబీఎస్‌ బస్టాండ్‌కు చేరుకున్నారు. అయితే ఏడు గంటల వరకు బస్సులు రాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. పికెట్‌ డిపో నుంచి రెండు బస్సులు మాత్రమే నడిచాయి. ఒకటి నిర్మల్‌కు, మరొకటి మెదక్‌కు నడిపినట్లు డీఎం ప్రణీత్‌ తెలిపారు. డిపోలో మొత్తం 62 బస్సులు ఉండగా, వీటిలో కేవలం రెండు బస్సులు మాత్రమే ఇతర జిల్లాలకు నడిపామన్నారు. మిగిలిన బస్సులన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులు కావడంతో వాటిని డిపోకే పరిమితం చేసినట్లు వివరించారు. కండక్టర్లు మాస్క్‌లను ధరించిన వారిని మాత్రమే బస్సులోకి అనుమతించారు. శానిటైజర్‌ వేసి చేతులను శు భ్రం చేసుకోవాల్సిందిగా సూచించారు. ప్రయాణికులు సామాజిక దూరం పాటిస్తూ కూర్చునేలా వారు జాగ్రత్తలు తీసుకున్నారు. 

జేబీఎస్‌లో దుమ్ము పట్టిన కుర్చీలు
మారేడుపల్లి: లాక్‌డౌన్‌ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జేబీఎస్‌ బస్టాండ్‌కు ప్రయాణికుల రాకపోకలు బంద్‌ అయ్యాయి. మంగళవారం నుండి టిఎస్‌ఆర్‌టీసీ బస్సులు నడపడంతో జేబీఎస్‌ బస్టాండ్‌ ప్రయాణికులతో సందడిగా మారింది. బస్టాండ్‌ లోపల ప్రయాణికుల కోసం ఏర్పాటుచేసిన కుర్చీలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. అధికారులు శానిటేషన్‌ చేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాలినడకన గుల్బర్గా నుంచి జేబీఎస్‌కు
వెస్ట్‌బెంగాల్‌ వెళ్లేందుకు గుల్బర్గా నుంచి గత ఐదురోజుల పాటు కాలినడకన బయలుదేరిన 17 మంది యువకులు తెలంగాణలో బస్సులు నడుస్తున్నట్లు తెలియడంతో  మంగళవారం జేబీఎస్‌ బస్టాండ్‌కు వచ్చారు. కర్ణాటకలోని గుల్బర్గాలో పని చేస్తున్న తాము కలకత్తా వెళ్లేందుకు బయలుదేరామన్నారు. అయితే వెస్ట్‌బెంగాల్‌ వెళ్లేందుకు జేబీఎస్‌లో బస్సు సౌకర్యం లేకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ రాష్ట్రానికి పంపించాల్సిందిగా పోలీసులను వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

శివార్లవరకే..
హయత్‌నగర్‌: 58 రోజుల లాక్‌డౌన్‌ తర్వాత ఆర్టీసీ బస్సులు మంగళవారం రోడ్డెక్కాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ప్రయాణికులను హైద్రాబాద్‌ నగర శివార్లకు చేర్చగా ఇక్కడి నుంచి ప్రయాణికులు జిల్లాలోని సొంత ఊర్లకు బయలుదేరారు. నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట్, ఖమ్మం జిల్లాల నుంచి 86 బస్సుల్లో 1500 మంది హయత్‌నగర్‌కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనల మేరకు ఒక్కో బస్సులో 15 నుంచి 20 మందిని మాత్రమే అనుమతించారు. కాగా ప్రయాణికుల నుంచి ఎలాంటి అధిక చార్టీలు వసూలు చేయలేదని గతంలో ఉన్న చార్టీలతోనే బస్సులు నడుపుతున్నట్లు హయత్‌నగర్‌ డివిజనల్‌ మేనేజర్‌ విజయ్‌భాను తెలిపారు. 

నగరంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు...
నగరం రెడ్‌ జోన్‌లో ఉన్నందున అధికారులు బస్సుల ను సిటీలోకి అనుమతించక పోవడంతో తమ ప్రాంతాలకు చేరేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. 

మరిన్ని వార్తలు