పండగ చేస్కోండి!

6 Oct, 2018 09:13 IST|Sakshi

సిటీ నుంచి తెలుగు రాష్ట్రాలకు 4480 అదనపు బస్సులు

ప్రత్యేక బస్సులపై 50 శాతం అదనపు చార్జీలు

ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు నిర్వహణ

నగర శివార్ల నుంచే రాకపోకలు

సాక్షి, సిటీబ్యూరో: దసరా ప్రత్యేక బస్సులకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. ఈ నెల 8వ తేదీ నుంచి 18 వరకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు 4480 బస్సులను అదనంగా నడిపేందుకు చర్యలు చేపట్టింది. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్, కాచిగూడ బస్‌స్టేషన్‌లతో పాటు లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్, టెలిఫోన్‌భవన్, ఈసీఐఎల్, ఉప్పల్‌ క్రాస్‌రోడ్, ఎల్‌బీనగర్‌ తదితర ప్రాంతాల నుంచి  ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఆర్టీసీ అధీకృత టికెట్‌ బుకింగ్‌ కేంద్రాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడుపుతారు. ఈ మేరకు ఒకే రూట్‌లో ప్రయాణించే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్న కాలనీల నుంచి నేరుగా బస్సులు బయలుదేరుతాయి. ప్రయాణికుల రద్దీ మేరకు బస్సుల సంఖ్యను పెంచేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. మరోవైపు దూరప్రాంతాలకు వెళ్లే  ప్రత్యేక బస్సుల్లో యదావిధిగా 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేయనున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు, విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. 

రద్దీకి అనుగుణంగా బస్సులు
సాధారణంగా ప్రతి రోజు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి   1.25 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌ల నుంచే  ఎక్కువ సంఖ్యలో బయలుదేరుతారు. దసరా రద్దీ నేపథ్యంలో  ప్రయాణికుల సంఖ్య ప్రతి రోజు  1.5 లక్షల నుంచి1.6 లక్షలకు పెరిగే  అవకాశం ఉంది. ముఖ్యంగా  15వ తేదీ నుంచి 18 వరకు ప్రయాణికుల రాకపోకలు భారీగా ఉంటాయి. ఈ మేరకు ప్రత్యేక బస్సుల సంఖ్య కూడా పెరగనుంది. దీంతో నగరంలో ట్రాఫిక్‌ రద్దీ చోటుచేసుకోకుండా ఆ మూడు రోజుల పాటు శివారు ప్రాంతాల నుంచే బస్సులు బయలుదేరేవిధంగా చర్యలు చేపట్టినట్లు ఆర్టీసీ  రంగారెడ్డి రీజనల్‌ మేనేజర్‌ యాదగిరి తెలిపారు. 

8 నుంచే స్పెషల్‌ బస్సులు
ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 1981 ప్రత్యేక బస్సులను 16వ తేదీ నుంచి 18 వరకు 2499 బస్సులను ఏర్పాటు చేస్తారు. 16వ తేదీ ఒక్క రోజే 1110 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. 17వ తేదీన మరో 1085 బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. 18వ తేదీన 304 బస్సులు అదనంగా బయలుదేరుతాయి. ఈ బస్సులన్నీ ప్రతి రోజు రాకపోకలు సాగించే సుమారు 3500 రెగ్యులర్‌ బస్సులకు అదనంగా నడిపే బస్సులే. ప్రయాణికులు ఆర్టీసీ ఏటీబీ కేంద్రాల నుంచి, బస్‌స్టేషన్‌లలోని టిక్కెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ల నుంచి ముందస్తు రిజర్వేషన్‌లు తీసుకోవచ్చు. అలాగే   ఠీఠీఠీ. http://www.tsrtconline.in/oprs-web  వెబ్‌సైట్‌ నుంచి కూడా టిక్కెట్‌లు బుక్‌ చేసుకోవచ్చు.

ఏ రూట్‌ బస్సులు ఎక్కడి నుంచి....
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల బస్సులు జేబీఎస్‌ నుంచి బయలుదేరుతాయి.
నంద్యాల, ఆత్మకూరు (కె), వెలుగోడు, నందికొట్కూరు, పులివెందుల, ఆళ్లగడ్డ, మైదుకూరు, బనగానపల్లి, బద్వేల్, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, రాజంపేట్, రాయచోటి, కోడూరు, చిత్తూరు వైపు వెళ్లే బస్సులు కాచిగూడ బస్‌స్టేషన్‌ నుంచి బయలుదేరుతాయి.
జనగామ, పరకాల, నర్సంపేట్, మహబూబాద్, వరంగల్‌ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్‌ నుంచి బయలుదేరుతాయి,
మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు వెళ్లే బస్సులను దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌ నుంచి నడుపుతారు.

ఎంజీబీఎస్‌ నుంచి....
మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లలోని వివిధ ప్లాట్‌పామ్‌ల నుంచి బయలుదేరే బస్సుల వివరాలు ఇలా ఉన్నాయి.
బస్సుల సమాచారం  కోసం సంప్రదించవలసిన ఫోన్‌ నెంబర్‌లు...
మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌  : 8330933419, జూబ్లీబస్‌స్టేషన్‌ : 8330933532, ఏటీఎం ఏపీఎస్‌ ఆర్టీసీ : 9100948191 

మరిన్ని వార్తలు