ఆర్టీసీ​ కార్మికులకు మరో అవకాశం!

5 Oct, 2019 18:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గడువు పొడిగింపుపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. శనివారం సాయంత్రం 6 గంటల్లోపు విధులకు రాకుంటే డిస్మిస్‌ చేస్తామని ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అయితే కార్మికులెవరూ ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదు. తాత్కాలిక సిబ్బందితో పోలీసుల బందోబస్తుతో బస్సులను నడిపినా ప్రజావసరాలకు ఏమాత్రం సరిపోలేదు. దసరా పండుగ కోసం సొంత ఊర్లకు ప్రయాణమైన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆర్టీసీ సమ్మె ప్రభావం స్పష్టంగా కనబడటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు కనబడుతోంది. రేపు ఉదయం వరకు గడువును పొడిగించాలని ప్రభుత్వం భావిస్తుస్తున్నట్టు సమాచారం. కార్మికులకు ఇచ్చిన గడువు ఈ సాయంత్రంతో ముగిసింది. ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.


అందని జీతాలు.. ఉత్కంఠ
ఆర్టీసీ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ప్రతినెలా ఒకటవ తేదీన అందాల్సిన జీతాలు.. గత కొద్దీ నెలలుగా ఆర్ధిక స్థితి బాగాలేకపోవడంతో 5వ తేదీన చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు ఖాతాల్లో జీతాలు పడకపోవడంతో ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. పండగ నేపథ్యంలో జీతాల కోసం కార్మిక కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుందా, లేదా అనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.


9 వేల బస్సులు తిరిగాయి: ప్రభుత్వం
ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల బస్సులు తిరిగాయని ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 2129 ఆర్టీసీ బస్సులు, 1717 అద్దె బస్సులు, 1155 ప్రైవేట్ బస్సులు నడిపినట్టు తెలిపింది. ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి 1195, మ్యాక్సీ క్యాబ్‌లతో పాటు 2778 ఇతర వాహనాలు నడిచాయని వెల్లడించింది. (చదవండి: తొలగించాలనుకుంటే నన్ను తీసేయండి)

మరిన్ని వార్తలు