ఏడాదిపాటు ‘దూరం’!

15 May, 2020 03:42 IST|Sakshi

ఆర్టీసీ బస్సుల్లో భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు

సూపర్‌ లగ్జరీలలో వరుసకు 3 సింగిల్‌ సీట్లు..

మిగిలిన బస్సుల్లో ఎడమవైపు, కుడివైపు ఒక్కొక్కరే..

గ్రీన్‌ జోన్లలో బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ సన్నద్ధం

సీఎం ముందుకు ప్రతిపాదనలు..

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైర స్‌ను కట్టడి చేసే వ్యాక్సిన్‌ ఎప్పుడొచ్చేది ఇంకా స్పష్టం కాని నేపథ్యంలో కనీసం ఏడాది పాటు భౌతికదూరం నిబంధనలు అమల్లో ఉంటాయన్న అంచనాలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా.. కరోనాతో సహజీవనం చాలాకాలమే ఉంటుందన్న సంకేతాలిస్తోంది. ఈ నేపథ్యంలో భౌతికదూరం విషయంలో తగిన చర్యలు చేపట్టా లని ప్రభుత్వ విభాగాలు భావిస్తున్నాయి. ప్రజా రవాణా విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. దీంతో మన ఆర్టీసీ ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. 

కరోనా సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా ఆ ప్రాంతంలో వైరస్‌ విస్తరిస్తుంది. అందుకే బాధితుడికి చేరువగా ఉండకుండా భౌతిక దూరం నిబంధన తప్పనిసరి. కానీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు భౌతిక దూరం నిబంధన అమలు చేయటం అంత సులువు కాదు. దీనికి పరి ష్కారంగా, ఏడాది పాటు వరుసకు ఒక్క ప్రయా ణికుడు చొప్పున మాత్రమే ప్రయాణించేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. బస్సుకు రెండు వైపులా ఉండే వరుసల్లో ఎడమవైపు ఒకరు, కుడి వైపు ఒకరు మాత్రమే కూర్చోవాల్సి ఉంటుంది. ఇందుకు వీలుగా అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. 

సూపర్‌ లగ్జరీలలో సీట్ల మార్పు..
రాష్ట్రంలో ప్రధాన ప్రాంతాల మధ్య సూపర్‌ లగ్జరీ బస్సులు తిరుగుతాయి. వీటికి ప్రతి వరుసలో రెండు చొప్పున సీట్లు ఉంటాయి. వీటిల్లో ఒక్కొ క్కరు చొప్పున కూర్చునేలా చేయాలని ముందు అనుకున్నారు. కానీ దాదాపు ఏడాది పాటు భౌతిక దూరం నిబంధన అమలు అయ్యే అవకాశం ఉన్నందున, సీట్లను మార్చాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశంలో వచ్చే సూచనల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోను న్నారు. సీట్లు మారిస్తే రెండువైపులా కలిపి మూడు సింగిల్‌ సీట్లు ఏర్పాటు చేస్తారు. ఎడమ, కుడి వైపు ఒక్కో సీటు తొలగించి, మధ్యలో ఉండే నడిచే ప్రదేశంలో అదనంగా సీటు ఏర్పాటు చేస్తారు. ఇందుకు నమూనాగా ఓ బస్సును సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి ఇందుకు అంగీకరిస్తే, మిగతా బస్సులను కూడా ఇలాగే మారుస్తారు. 

పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో ఇలా..
పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో వరుసకు.. ఎడమ వైపు ఇద్దరు ప్రయాణికులు, కుడివైపు ముగ్గురు ప్రయాణికులు కూర్చునేలా సీట్ల అమరిక ఉంటుంది. ఆ సీట్లు అలాగే ఉంచి, ఎడమ వైపు ఉండే రెండు సీట్లకు ఒకరు, కుడివైపు మూడు సీట్లకు ఒకరు చొప్పున కూర్చునేలా చర్యలు తీసుకుంటారు. ఎడమవైపు మొదటి వరసలో కిటికీవైపు ఒకరు కూర్చుంటే, దాని వెనుక సీటులో కిటికీ వైపు కాకుండా మొదట కూర్చోవాల్సి ఉంటుంది. ఇక కుడి వైపు ముగ్గురు కూర్చునే సీటులో కిటికీ వైపు కాకుండా మొదటి సీటులో ఒక్కరు కూర్చుంటారు. దాని వెనుక ముగ్గురు కూర్చునే సీటులో కిటికీ పక్కన కూర్చోవాల్సి వస్తుంది. అంటే జిగ్‌ జాగ్‌ పద్ధతిలో అన్నమాట. దీంతో ప్రయాణికుల మధ్య కనీసం మీటరు భౌతిక దూరం ఉంటుంది. 

సిటీ బస్సుల్లో స్టాండింగ్‌ నిషేధం..
సిటీ బస్సు అనగానే కిక్కిరిసి ప్రయాణికులు నిలబడే దృశ్యమే కనిపిస్తుంది. అయితే ఏడాది పాటు సిటీ బస్సుల్లో నిలబడి ప్రయాణించటాన్ని నిషేధించాలని నిర్ణయించారు. వీటిల్లో కూడా వరసకు ఒక ప్రయాణికుడే కూర్చునే పద్ధతి అమలు చేయాలని నిర్ణయించారు. ఆచరణలో ఇది చాలా కష్టమైనప్పటికీ, దాన్ని అమలు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది.

బస్సుల ప్రారంభం ఎప్పుడు..
రాష్ట్రంలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగతావి దాదాపు గ్రీన్‌జోన్‌ పరిధిలోకి వచ్చేశాయి. ఈ మేరకు కేంద్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వెరసి ఈ మూడు జిల్లాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో బస్సులు తిప్పేందుకు వెసులుబాటు కలిగింది. ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపగానే ఆయా జిల్లాల్లో బస్సులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. 15న దీనిపై సమీక్షిస్తానని ఇటీవల సీఎం తెలిపారు. అయితే, ఆ భేటీపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ సమావేశం ఎప్పుడు జరిగినా, ఆర్టీసీ అధికారులు మాత్రం బస్సులు తిప్పేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, వైద్యులు మాత్రం ఈ నెలాఖరు వరకు గ్రీన్‌జోన్లలో కూడా బస్సులు తిప్పొద్దని సూచిస్తున్నారు. 

ఆటోలు, క్యాబ్‌లకు అనుమతి.. 
గ్రీన్‌ జోన్‌ పరిధిలో ఆటోలు, క్యాబ్‌లకు కూడా పరిమితులతో కూడిన అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. వాటిలో ఎంతమంది ప్రయాణించాలన్న దానిపై నిబంధనలు విధించనున్నారు. హైదరాబాద్‌లో ఇప్పట్లో అనుమంతించే అవకాశం కనిపించట్లేదు. ఇప్పటికే అనధికారికంగా కొన్ని ప్రాంతాల్లో షేరింగ్‌ ఆటోలు తిరుగుతున్నాయి. ఒక్కో ఆటోలో ఏడెనిమిది మంది కూర్చుంటున్నారు. దీంతో వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, శివారు ప్రాంతాలకు సంబంధించి దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. 

మరిన్ని వార్తలు