ఏసీ బస్సులు రెడీ

26 May, 2020 08:47 IST|Sakshi

ఎయిర్‌పోర్టుకు సర్వీసుల పునరుద్ధరణకు ఆర్టీసీ చర్యలు

ప్రధాన రూట్లలో 53 బస్సులు

రద్దీకి అనుగుణంగా సర్వీసుల నిర్వహణ

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌అంతర్జాతీయ విమానాశ్రయానికి బస్సులు నడిపేందుకు గ్రేటర్‌ ఆర్టీసీ సన్నద్ధమైంది. దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమైన దృష్ట్యా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టు వరకు ఏసీ బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే బస్సులను రోడ్డెక్కించనున్నట్లు చెప్పారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు సుమారు 53 ఏసీ బస్సులు విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో 40 ఎలక్ట్రికల్‌ ఏసీ వోల్వో బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. మరో 13 ఏసీ పుష్పక్‌ బస్సులను ఆర్టీసీ స్వయంగా నడుపుతోంది.

లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రకాల సర్వీసులతో పాటు ఈ బస్సులను కూడా నిలిపివేశారు. 2 నెలల తరువాత  ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే  ప్రయాణికుల కోసం ఈ సర్వీసులన్నింటినీ పునరుద్ధరించనున్నట్లు అధికారులు  తెలిపారు. సాధారణ రోజుల్లో సుమారు 7 వేల మందికి పైగా ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు. ప్రస్తుతం కేవలం దేశీయ విమానాలే నడుస్తున్నాయి. క్రమంగా సర్వీసుల సంఖ్యను పెంచనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన ఎయిర్‌పోర్టును సందర్శించి కోవిడ్‌ నియంత్రణ ఏర్పాట్లను, విమానాల రాకపోకలు, ప్రయాణికుల సదుపాయాలను పరిశీలించిన అనంతరం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే  పెరుగనున్న  విమాన సర్వీసులకు అనుగుణంగా  ప్రయాణికుల రాకపోకల కోసం బస్సులను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్లు గ్రేటర్‌ ఈడీ పేర్కొన్నారు. 

3 ప్రధాన మార్గాల్లోనే బస్సుల ఏర్పాటు
విమానాశ్రయానికి రాకపోకలు సాగించేందుకు 3 ప్రధాన రూట్లలో బస్సులు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి సంగీత్‌ చౌరస్తా, తార్నాక, ఉప్పల్, చాంద్రాయణగుట్ట, బాలాపూర్, పహాడీషరీఫ్‌ రూట్‌లో  ఎయిర్‌పోర్టుకు బస్సులు రాకపోకలు సాగిస్తాయి. మరికొన్ని బస్సులు జేఎన్‌టీయూ నుంచి అమీర్‌పేట్, బంజారాహిల్స్, మాసాబ్‌ట్యాంక్, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే రూట్‌లో ఎయిర్‌పోర్టుకు నడుస్తాయి. బీహెచ్‌ఈఎల్‌ నుంచి గచ్చిబౌలి, ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా కొన్ని బస్సులను నడుపుతున్నారు. ఈ మూడు మార్గాలతో పాటు ఆల్విన్‌ కాలనీ నుంచి ఔటర్‌ రింగు రోడ్డు మీదుగా కొన్ని నడుస్తున్నాయి. కానీ ఈ రూట్‌లో పెద్దగా ఆదరణ లేకపోవడం వల్ల ప్రస్తుతం 3 రూట్లకే  ఆర్టీసీ పరిమితం కానుంది. ఈ రూట్లలో చార్జీలు కనిష్టంగా రూ.50 నుంచి రూ.250 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీ, జైపూర్‌ తదితర ఉత్తరాది రాష్ట్రాలకు, కర్ణాటకకు విమాన సర్వీసులు మొదలయ్యాయి. కొన్ని రాష్ట్రాలు అనుమతించకపోవడం వల్ల కొన్ని సర్వీసులు రద్దయ్యాయి. కానీ ఒకటి, రెండు రోజుల్లో విమాన సర్వీసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇందుకనుగుణంగా నగరం నుంచి ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించేందుకు ఏసీ బస్సులు సదుపాయంగా ఉంటాయి.  

కోవిడ్‌ నిబంధనల మేరకు నిర్వహణ...
ప్రభుత్వం అనుమతిస్తే కోవిడ్‌ నిబంధనల మేరకు ఎయిర్‌పోర్టు బస్సులను నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. బస్సులను ప్రతి రోజు శానిటైజ్‌ చేయడంతో పాటు ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించేవిధంగా చర్యలు  తీసుకోన్నట్లు పేర్కొన్నారు. విమాన ప్రయాణాలకు ప్రభుత్వం విధించిన నిబంధనలనే ఆర్టీసీ బస్సుల్లో అమలు చేయనున్నట్లు ఈడీ చెప్పారు.

మరిన్ని వార్తలు