హలో.. ఆర్టీసీ!

8 Jan, 2020 03:36 IST|Sakshi

ఇల్లు ఖాళీ చేస్తున్నారా.. ఇంకేం ఆర్టీసీకి ఫోన్‌ చేయండి

ప్యాకర్స్‌ అండ్‌  మూవర్స్‌ సేవలకు సిద్ధమైన రవాణా సంస్థ

దూర ప్రాంతాలకు బుకింగ్స్‌.. నెలాఖరున కార్గో సర్వీస్‌ ప్రారంభం!

ప్రభుత్వ కార్పొరేషన్ల సామగ్రి తరలింపు ఆర్డర్లన్నీ ఆర్టీసీకే..

ప్రైవేటు బుకింగ్స్‌కు మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌గా కండక్టర్లు  

సాక్షి, హైదరాబాద్‌: మీకు మరో చోటకు బదిలీ అయిందా.. అయితే మీ ఇంటి సామగ్రి తరలించేందుకు ఆర్టీసీకి ఫోన్‌ చేస్తే చాలు. ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ తరహాలో సేవలకు మీ ఇంటి ముంగిటకు ‘ఎర్ర బస్సు’వచ్చి ఆగుతుంది. వింటుంటే కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆర్టీసీ కొత్తగా ప్రారంభించబోతున్న కార్గో సేవల్లో ఇదీ ఓ భాగమే. ఒక పట్టణం నుంచి మరో పట్టణం, దూర ప్రాంతాలకు ఇంటి సామగ్రి తరలించేందుకు కూడా ఆర్టీసీ సై అంటోంది. డీజిల్, సిబ్బంది ఖర్చు వచ్చేలా.. దూర ప్రాంతాలకే ఈ సేవలు ఉండనున్నాయి. ఇక ప్రభుత్వ మద్యం డిపోల నుంచి మద్యం తరలింపు కూడా ఆర్టీసీ కార్గో సర్వీసుల్లోనే సాగనుంది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు, రేషన్‌ సరుకులు, ఎఫ్‌సీఐ గోదాములకు ధాన్యం, కూరగాయల తరలింపు.. ఇలా అన్నీ వీటిల్లోనే. ఇవే కాకుండా ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుంచి కూడా వస్తువుల తరలింపునకు బుకింగ్స్‌ తీసుకోబోతోంది. ఈ నెలాఖరుకు కార్గో సేవలను ప్రారంభించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. తొలుత రాష్ట్రం పరిధిలోనే వీటి సేవలు ఉండనుండగా, వీలైనంత త్వరలో ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలని నిర్ణయించారు. 

అక్టోబర్‌ నాటికి 822 బస్సులు..
తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు కార్గో సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నగరంలో 822 ప్రయాణికుల బస్సులను ఉపసంహరించుకుని వాటిని సరుకు రవాణా వాహనాలుగా మార్చాలని నిర్ణయించింది. ఆర్టీసీ మియాపూర్‌ బస్‌ బాడీ బిల్డింగ్‌ వర్క్‌షాపులో ఇప్పటికే 8 బస్సులను సిద్ధం చేసింది. ప్రతినెలా 50 చొప్పున బస్సులను ఇక్కడ మోడిఫై చేయనున్నారు. అక్టోబర్‌ నాటికి 822 బస్సులు సిద్ధం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పట్లోగా వాటిని సిద్ధం చేసే సామర్థ్యం ఆర్టీసీ యూనిట్‌కు లేకపోవటంతో మిగతావాటిని ప్రైవేటు వర్క్‌షాపుల్లో సిద్ధం చేయాలని నిర్ణయించారు.

ఈ నెలాఖరుకు 50 బస్సులతో కార్గో విభాగం ప్రారంభించి, కొత్తగా సిద్ధమయ్యే బస్సులను దానికి చేరుస్తూ పోవాలని నిర్ణయించారు. వీటి ద్వారా సాలీనా రూ.400 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. రేషన్‌ సరుకులు, ప్రభుత్వ గోదాములకు ధాన్యం, కూరగాయలు, ఇతర వస్తువుల తరలింపు, ప్రభుత్వ ముద్రణాలయం నుంచి పాఠ్యపుస్తకాల తరలింపు, విద్యార్థులకు యూనిఫామ్స్‌ తరలింపు, సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్స్‌ నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల సరఫరా, ప్రభుత్వ హాస్టల్స్‌కు బియ్యం ఇతర వస్తువుల తరలింపు.. ఇలా ప్రభుత్వ పరంగా ఉండే సరుకు రవాణా అంతా ఆర్టీసీ కార్గో బస్సులే చేయనున్నాయి. ఈమేరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వటంతో వాటి నుంచి ఆర్టీసీ ఆర్డర్స్‌ కోసం దరఖాస్తు చేసింది.

1,210 మందితో వ్యవస్థ
ఆర్టీసీలో ప్రస్తుతం సాధారణ బస్సుల్లోనే కొన్ని పార్శిళ్లను రవాణా చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా కార్గో పేరుతో సరుకు రవాణా బస్సు లు ప్రారంభిస్తున్నందున, ఈ విభాగానికి ప్రత్యేకంగా సిబ్బంది అవసరం కూడా వచ్చింది. 822 కార్గో బస్సుల నిర్వహణకు 1,210 మంది సిబ్బం ది అవసరమవుతారని లెక్కలు తేల్చింది. ఇటీవల రద్దయిన బస్సుల వల్ల మిగిలిపోయే సిబ్బందిని ఇటు బదలాయిస్తున్నారు. వీరే కాకుండా జోనల్‌ స్థాయిలో ఓ డీవీఎం స్థాయి అధికారి, రీజియన్‌ స్థాయిలో డిపో మేనేజర్‌ స్థాయి అధికారిని పర్యవేక్షకులుగా నియమిస్తున్నారు. ప్రతి డిపోలో ఓ కండక్టర్‌ను మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా నియమిస్తున్నా రు. వీరు నిత్యం ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు సంస్థల నుంచి ఆర్డర్లు తెచ్చే పనిలో ఉంటారు. వెనక వైపు క్రీమ్‌ కలర్‌ స్ట్రిప్‌తో పూర్తి ఎరుపు రంగు లో ఈ బస్సులు ఉండబోతున్నాయి. వీటిని ఆయా డిపోల్లోనే అందుబాటులో ఉంచుతారు. సిబ్బంది కూడా అక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తారు.

సమీక్షించిన ఇన్‌చార్జి ఎండీ..
ఈ నెలాఖరుకల్లా కార్గో పార్శిల్‌ సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన బస్‌భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో దీనిపై సమీక్ష నిర్వహించారు. నష్టాల్లో ఉన్న సంస్థకు బాసటగా నిలిచేలా ఈ విభాగాన్ని తీర్చిదిద్దాలన్నారు. రెవెన్యూ, ఐటీ విభాగం ఈడీ పురుషోత్తం కార్గో పార్శిల్‌ విభాగం డీపీఆర్‌ను సునీల్‌శర్మకు అందజేశారు. ఈడీలు వినోద్‌కుమా ర్, యాదగిరి, టీవీరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు