బస్సులు రోడ్డెక్కేనా.?

21 Nov, 2019 07:20 IST|Sakshi

46 రోజుల పాటు కొనసాగిన ఆర్టీసీ సమ్మె

నగరంలో సగానికి పైగా నిలిచినసిటీ బస్సులు

ప్రైవేట్‌ సిబ్బందితో నడిపినా తప్పని ఇబ్బందులు 

సాక్షి, హైదరాబాద్‌: షరతులు విధించడకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమేనని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కేనా అన్న చర్చ మొదలైంది.   గతంలో ఎన్నడూ లేనివిధంగా 46 రోజుల పాటు కొనసాగిన సుదీర్ఘ సమ్మెను  ప్రభుత్వం మొదటి నుంచి  చట్టవిరుద్ధంగానే భావిస్తోంది. ఈ నేపథ్యంలో కార్మికులపై అనేక ఆంక్షలు విధించింది. విధుల్లో చేరేందుకు రెండుసార్లు గడువు విధించింది. అయినా కార్మికులు మాత్రం వెనక్కి తగ్గకుండా సమ్మెను కొనసాగించారు. చివరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు లభించకుండానే తమంతట తాముగా సమ్మెను విరమించి విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. గురువారం నుంచి నగరంలోని అన్ని డిపోల్లో   డ్రైవర్లు, కండక్టర్లతో సహా సిబ్బంది విధుల్లో చేరే అవకాశా లున్నాయి.

అయితే  ఎలాంటి  ఆంక్షలు లేకుండా  ప్రభుత్వం వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకుంటుందా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం రెండుసార్లు  విధించిన గడువుల్లో  కొందరు  విధుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు.  గడువు తరువాత వచ్చిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు  నిరాకరించారు. ఈ నేపథ్యంలో  గురువారం నుంచి కార్మికులంతా  డ్యూటీలో చేరుతారా...సిటీ బస్సులన్నీ రోడ్డెక్కుతాయా అనేది స్పష్టం కావాల్సి ఉంది. అక్టోబర్‌ 5న మొదలైన సమ్మె నవంబర్‌ 20న ముగిసింది. ఆర్టీసీ చరిత్రలోనే ఇది సుదీర్ఘ సమ్మెగా నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమంలోనూ   సకల జనుల సమ్మెలో భాగంగా కార్మికులు ఆందోళనలో పాల్గొన్నప్పటికీ ఆర్టీసీలో ఇప్పటి  వరకు జరిగిన అన్ని సమ్మెల్లోకెల్లా  ఇదే అతి పెద్ద సమ్మెగా నిలిచిపోయింది. 

సగానికి పైగా డిపోలకే పరిమితం... 
గ్రేటర్‌లోని 29 డిపోల పరిధిలో 3750కి పైగా బస్సులు ఉన్నాయి. కార్మికుల సమ్మె కారణంగా  సగానికి పైగా డిపోల్లోనే నిలిచిపోయాయి, 19 వేల మందికి పైగా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌లు, వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఆత్మహత్యలు, గుండెపోటుతో ఒకరిద్దరు కన్నుమూశారు. అన్ని డిపోల్లో, బస్‌స్టేషన్లు, ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌ వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి వందలాది మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పలువురు కార్మికులకు గాయాలు కూడా అయ్యాయి. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వం దసరా సెలవులను సైతం పొడిగించింది.  సమ్మెకాలంలో ప్రైవేట్‌ సిబ్బంది సహాయంతో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ  అధికారులు చర్యలు చేపట్టారు. కండక్టర్లకు రూ.1000, డ్రైవర్లకు రూ.1500 చొప్పున చెల్లించినా, ప్రతి రోజు  1000 నుంచి  1500 కంటే  ఎక్కువ బస్సులు నడుపలేకపోయారు.  

దీంతో దసరా సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేట్‌  బస్సులు, ఇతర వాహనాల్లో పెద్ద ఎత్తున దోపిడీ కొనసాగింది. దసరా సెలవుల అనంతరం స్కూళ్లు, కాలేజీలు  తెరుచుకోగా, అరకొర బస్సుల కారణంగా  విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగర శివార్లలోని కాలేజీలకు వెళ్లే విద్యార్థులు సమ్మె కారణంగా నరకం చవి చూడాల్సి వచ్చింది. రాత్రి 7 గంటల నుంచి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మె కారణంగా మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణికుల రద్దీ  బాగా పెరిగింది. ప్రతి రోజు సుమారు 3.5 లక్షల మంది మెట్రోల్లో రాకపోకలు సాగించగా, 1.7 లక్షల మంది ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణం చేశారు.  

రూ.100 కోట్లకు పైగా నష్టం... 
కార్మికుల సమ్మె కారణంగా  ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌కు రూ.వంద కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అప్పటికే పెద్ద ఎత్తున నష్టాల్లో కూరుకుపోయిన సంస్థకు సమ్మె శరాఘాతంగా మారింది. రోజుకు రూ.1.5 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు  ప్రైవేట్‌ సిబ్బంది చేతివాటంతో కూడా ఆదాయానికి గండిపడింది. సమ్మె తొలిరోజుల్లో రోజుకు రూ.20 లక్షలు కూడా రాకపోవడం గమనార్హం. కొన్ని రూట్లలో  ప్రైవేట్‌ సిబ్బంది వేతనాలు కూడా  ఆర్టీసీయే చెల్లించాల్సి వచ్చింది.

గ్రేటర్‌వాసులకు ఊరట.. 
సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు ఎలాంటి ఆంక్షలు లేకుండా తిరిగి యధావిధిగా విధుల్లో చేరితే ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రతి రోజు  32 లక్షల మంది ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటారు. సుమారు 5 లక్షల మంది విద్యార్థులు బస్‌పాస్‌లను కలిగి ఉన్నారు. రెండు ప్రధాన మార్గాల్లో మెట్రో రైళ్లు  నడుస్తున్నప్పటికీ  నగరంలోని అన్ని ప్రాంతాలకు సిటీ బస్సే  ప్రధాన రవాణా సదుపాయం. నగరంలో రోజుకు 9.5 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు 42 వేల ట్రిప్పులతో రాకపోకలు సాగిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు