బస్సు చార్జీలు పెరిగాయ్‌

3 Dec, 2019 05:18 IST|Sakshi

నష్టాల నేపథ్యంలో టికెట్‌ ధరలను సవరించిన ఆర్టీసీ

కి.మీ.కు 20 పైసల చొప్పున బస్సు చార్జీల పెంపు

మంగళవారం తెల్లవారుజామున తొలి షిఫ్ట్‌ నుంచి అమల్లోకి..

పల్లె వెలుగు, సిటీ సర్వీసుల కనిష్ట చార్జీ రెట్టింపుతో భారం ఎక్కువే... చిల్లర సమస్య రాకుండా టికెట్‌ రేట్లు రౌండ్‌ ఆఫ్‌

ప్రజలపై ఏటా పడనున్న రూ. 850 కోట్ల ఆర్థిక భారం  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మూడున్నరేళ్ల తర్వాత బస్సు చార్జీలు పెరిగాయి. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొనడం, ఇదే సమయంలో రాష్ట్రంలో ఆర్టీసీ ఆదాయం తగ్గిపోవడం, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) భారం కావడంతో ఆర్టీసీ యాజమాన్యం చార్జీలు పెంచక తప్పలేదు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండటంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రస్తుతానికి బస్సు చార్జీల పెంపు మినహా గత్యంతరం లేదంటూ ఆర్టీసీ అధికారులు రెండేళ్లుగా చేస్తున్న విన్నపాలకు ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. దీంతో టికెట్‌ ధరలను ఆర్టీసీ సవరించింది. 2016 జూన్‌లో 10 శాతం మేర టికెట్‌ ధరలు పెంచిన ఆర్టీసీ... ఇప్పుడు కి.మీ.కు 20 పైసలు చొప్పున పెంచింది. అంటే 18.80 శాతం మేర చార్జీల మోత మోగినట్టయింది.

పెరిగిన చార్జీలు మంగళవారం తెల్లవారుజామున తొలి షిఫ్ట్‌ నుంచి అమల్లోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చార్జీలు పెరగడం ఇది రెండోసారి. తాజా పెంపుతో ప్రజలపై సాలీనా దాదాపు రూ. 850 కోట్ల మేర భారం పడనుంది. ఆర్టీసీకి అంతేమొత్తం ఆదాయం పెరగనుంది. కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచితే వార్షిక భారం రూ. 752 కోట్ల మేర ఉంటుందని తొలుత లెక్కలేశారు. గత నెల 28న జరిగిన మంత్రివర్గ సమావేశానంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ సిటీ సర్వీసులు, పల్లె వెలుగు బస్సుల కనీస చార్జీని రెట్టింపు చేస్తూ రూ. 10కి సవరించడం, చిల్లర సమస్య ఉత్పన్నం కాకుండా స్టేజీలవారీగా మొత్తాన్ని రౌండ్‌ ఆఫ్‌ చేయడంతో కి.మీ.కు 20 పైసల కంటే ఎక్కువ మొత్తం పెరిగినట్టయింది.

ఫలితంగా ప్రజలపై కనీసం రూ. 100 కోట్ల అదనపు భారం పడనుంది. దీంతో తాజా పెంపు భారం రూ. 850 కోట్లకు చేరుతుందని అంచనా. సుదీర్ఘకాలం సమ్మె తర్వాత బేషరతుగా ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడంతో వారిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దీనికితోడు ముఖ్యమంత్రి ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయడంతో పనితీరులో గణనీయ మార్పు వస్తుందన్న అంచనా ఉంది. దీనివల్ల బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని అధికారులు నమ్ముతున్నారు. ఇదే జరిగితే టికెట్ల పెంపుతో వచ్చే అదనపు ఆదాయం రూ. వెయ్యి కోట్లకు చేరుతుందన్న భావన వ్యక్తమవుతోంది.

వై.ఎస్‌. హయాంలో పెరగని చార్జీలు...
ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా బస్సు చార్జీలు పెరగలేదు. చార్జీల పెంపుతో జనంపై భారం మోపడం కంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయం పెంచుకోవడంతోపాటు సిబ్బంది పనితీరు మెరుగుపరచడం, ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే పద్ధతులను అవలంబించారు. దీంతో ఆర్టీసీకి పెద్ద ఇబ్బంది లేకుండా పోయింది. అయితే ఆయన మరణానంతరం వరుసగా ఏటా టికెట్‌ చార్జీలు పెంచుతూ పోయారు. 2010లో ఏకంగా 28.41 శాతం పెంచి జనంపై రూ. 196 కోట్ల భారం మోపారు. 2011లో 10 శాతం పెంచారు. ఫలితంగా ప్రజల జేబుకు రూ. 221 కోట్ల మేర చిల్లు పడింది. 2012లో 12.50 శాతం, 2013లో 9.50 శాతం మేర టికెట్‌ చార్జీలు పెంచారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి రెండున్నరేళ్లలో సర్కారు టికెట్‌ చార్జీల పెంపు జోలికి వెళ్లలేదు. అయితే ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి జీతాలు చెల్లించేందుకు కూడా ఇబ్బంది పడే స్థాయికి చేరడంతో వెంటనే టికెట్‌ చార్జీలు పెంచుకునేందుకు అనుమతించాల్సిందిగా అధికారులు ప్రభుత్వాన్ని కోరడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు 2016లో 10 శాతం చార్జీలు పెంచారు. కానీ అది ఏమాత్రం సరిపోకపోవడంతో కనీసం 15 శాతం నుంచి 20 శాతం మేర పెంచుకునేందుకు అనుమతించాలని ఆ తర్వాత నాలుగు పర్యాయాలు ఆర్టీసీ కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంతకాలం తర్వాత ఇప్పుడు మరోసారి పెంచుకునేందుకు సీఎం అనుమతించారు. దాదాపు అధికారులు కోరిన స్థాయిలోనే పెంపు జరిగింది.

కనీస చార్జీలు ఇలా 
రూ. 10 పల్లె వెలుగు, సిటీలో
రూ. 15 ఎక్స్‌ప్రెస్‌లో
రూ. 20 డీలక్స్‌లో
రూ. 25 సూపర్‌ లగ్జరీలోమరిన్ని వార్తలు