‘హైకోర్టు ఆదేశాలు మాకు ఆమోదయోగ్యమే’ 

13 Nov, 2019 02:14 IST|Sakshi

సమ్మె విరమించమని చెబితే అందుకు సిద్ధం 

ఆర్టీసీ జేఏసీ స్పష్టీకరణ 

సాక్షి, హైదరాబాదు : సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జిలతో కమిటీ వేస్తే స్వాగతిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పేర్కొంది. హైకోర్టు ఆదేశాలు, కొత్తగా వేసే కమిటీ నిర్ణయాలు తమకు ఆమోదయోగ్యమేనని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేయొద్దని, ఇంకా భేషజాలకు పోయి సమస్యను పెంచొద్దని హితవు పలికారు. వెంటనే చర్చల ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధం కావాలని సూచించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తులతో కమిటీ వేసి, తమను సమ్మె విరమించమని హైకోర్టు సూచిస్తే.. అందుకు సిద్ధంగా ఉన్నామని జేఏసీ నేత థామస్‌ రెడ్డి చెప్పారు. అయితే, కమిటీకి నిర్ధారిత కాల పరిమితి ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. సమ్మె విరమించమని ఆ కమిటీ చెప్పినా అందుకు సిద్ధమేనని స్పష్టంచేశారు.   

డిపోల వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసనలు
సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె బుధవారంతో నలభై రోజులకు చేరుకోనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను ముమ్మరంగా నిర్వహించాలని కార్మిక సంఘాల జేఏసీ జిల్లా నేతలకు సూచించింది. మంగళవారం కూడా కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో నిరసనలు ఉధృతంగానే కొనసాగించారు. వాస్తవానికి జేఏసీ కన్వీనర్‌తోపాటు ముగ్గురు కో–కన్వీనర్లు మంగళవారం నివరధిక నిరశన చేపట్టాలని నిర్ణయించినా.. పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో దాన్ని వాయిదా వేసుకున్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జిలతో కమిటీ విషయాన్ని హైకోర్టు ప్రస్తావించటాన్ని కార్మికులు ఆసక్తిగా గమనించారు. ఇది తమ సమస్యకు పరిష్కారం చూపే చర్యగా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మంగళవారం 6,406 బస్సులను తిప్పినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.  

మరిన్ని వార్తలు