ఎన్టీఆర్‌ కంటే గొప్ప మేధావా కేసీఆర్‌..?

17 Oct, 2019 15:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వంపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం ఆయన ఆర్టీసీ జేఏసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...‘ నా ఫోన్‌ కూడా ట్యాప్‌ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి ఎవరికీ శాశ్వతం కాదు. ఎంతోమంది నేతలు వస్తుంటారు... వెళుతుంటారు. ఎన్టీఆర్‌ కన్నా కేసీఆర్‌ మేధావా? 1993-94 సంక్షోభాన్ని కేసీఆర్‌ మర్చిపోకూడదు.

ప్రజాస్వామ్య పునాదులు కదులుతున్నాయ్‌. ఆర్టీసీ సమస్య పరిష్కారం కాకుంటే 1994 తరహా సంక్షోభం రావొచ్చు. ఇద్దరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఇస్తూ మాట్లాడారు. ఆర్టీసీ సమ్మెపై మంత్రులు హరీశ్‌ రావు, ఈటల రాజేందర్‌, జగదీశ్‌ రెడ్డి మౌనం వీడాలి. మేధావులు మౌనంగా ఉండకూడదు. పలువురు మంత్రులు కార్మికులను విమర్శించి  ఇంటికి వెళ్లి ఏడుస్తున్నారు. ప్రభుత్వంతో ఇప్పటికీ చర్చలు జరిపేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. హైకోర్టు సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి’ అని కోరారు. కాగా తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 13వ రోజు కూడా కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు