‘ఆర్టీసీ’పై మళ్లీ సీఎం సమీక్ష

10 Nov, 2019 03:23 IST|Sakshi

 శనివారం రాత్రి ఉన్నతాధికారులు, ఏజీతో భేటీ... సోమవారం కోర్టులో అనుసరించాల్సిన తీరుపై చర్చ 

శుక్రవారం రాత్రి సుదీర్ఘంగా చర్చించినా, మరోసారి సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెకు సంబంధించి దాఖలైన కేసును సోమవారం హైకోర్టు మరోసారి విచారించనున్న నేపథ్యంలో సీఎం కె. చంద్రశేఖర్‌రావు శనివారం రాత్రి మళ్లీ సమీక్షించారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఏసీ ప్రసాద్‌ తదితరులతో దాదాపు గంటన్నరపాటు ఆయన భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి సమీక్షించి సుదీర్ఘంగా చర్చించిన సీఎం, శనివారం మళ్లీ భేటీ కావటం విశేషం. గత విచారణ సమయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో సీఎం వరస సమీక్షలతో, తదుపరి విచారణ సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఏకంగా తెలంగాణ ఆర్టీసీ ఉనికినే ప్రశ్నించే పరిస్థితి వచ్చినందున, టీఎస్‌ఆరీ్టసీ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు, దాని చట్టబద్ధతను వివరించాలని ఆయన సూచించినట్లు తెలిసింది.

సోమవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పక్షంలో, వాటిపై వ్యవహరించాల్సిన తీరుపై చర్చించినట్లు సమాచారం. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఇప్పటికే ఓసారి అభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలో, సోమవారం హైకోర్టు సూచనల అనంతరం దాని ఆవశ్యకతపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రైవేటు బస్సులకు పరి్మట్లు జారీ చేసే విషయానికి సంబంధించి సోమవారం వరకు నోటిఫికేషన్లు వెలువరించొద్దన్న ఆదేశం ఉన్నందున, దానిపై కోర్టు వ్యాఖ్యానిస్తే ఎలా వ్యవహరించాలన్న విషయంలోనూ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశ వివరాలను సీఎం కార్యాలయం అధికారికంగా వెల్లడించకపోవటం విశేషం. భేటీకి హాజరైన అధికారులు కూడా మాట్లాడేందుకు అందుబాటులోకి రాలేదు. ‘కోర్టు ఎలా స్పందింస్తుందో వేచి చూద్దాం. మనం ఏం చెప్పినా వినే స్థితిలో లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేక దృక్పథంతో ఉంది కోర్టు. మనం చెప్పాల్సిందేం లేదు. కేబినెట్‌ ప్రొసీడింగ్‌ అడిగే అధికారం కోర్టుకు లేదు. కొత్త చట్టం ప్రకారమే తీర్మానించాం. విధివిధానాలే ఖరారు చేయకముం దే ఎలా తప్పు పడతారు’’అని సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్‌ స్పందించినట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు