ఆర్టీసీ సమ్మె : చర్చలకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

25 Oct, 2019 19:16 IST|Sakshi

ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించిన అధ్యయన కమిటీ

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ఏర్పాటైన అధ్యయన కమిటీ కేసీఆర్‌కు నివేదిక అందించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కార్మికులతో చర్చలకు ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం రేపు (శనివారం) చర్చలు జరిపే అశకాశం ఉంది. ఈడీల స్థాయిలో ఆర్టీసీ కార్మికులతో రేపు ఉదయం 11 గంటలకు బస్‌ భవన్‌లో చర్చలు జరగనున్నాయి. ఆర్థికపరమైన 12 అంశాలపై చర్చించే అవకాశముంది.

హైకోర్టు ఆదేశాలమేరకు..  విలీనం మినహా 21 డిమాండ్ల సాధ్యసాధ్యాలపై మూడు రోజుల క్రితం ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ ఆరుగురు ఈడీలతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అధ్యయన కమిటీ రెండు రకాల నివేదికలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రతి అంశానికి రెండు రకాల సమాధానాలు అధికారులు సిద్ధం చేసినట్టు సమాచారం. కోర్టుకు సమగ్ర వివరాలు అందించేలా కమిటీ సభ్యులు రిపోర్టు తయారు చేశారు. ఈ నివేదికను 28న జరిగే విచారణలో ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించనుంది. ఆర్టీసీకి అద్దెబస్సుల అవసరంపై కూడా కమిటీ సభ్యులు మరో నివేదికను సిద్ధం చేసినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు