ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోండి 

27 Nov, 2019 03:04 IST|Sakshi
మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో మాట్లాడుతున్న  ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. చిత్రంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి

ప్రధాని మోదీకి తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల వినతి 

సాక్షి, న్యూఢిల్లీ: డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధాని మోదీని కాంగ్రెస్‌ ఎంపీలు కోరారు. ఈ మేరకు ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో ప్రధానిని కలిసేందుకు యత్నించగా.. వీలుకాకపోవడంతో ప్రధాని కార్యాలయ కార్యదర్శిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి కార్మికుల సమస్యలను వివరించారు. ఆర్టీసీలో కేంద్రానికి 33% వాటా ఉందని, అందువల్ల సంస్థ, ఉద్యోగులను రక్షించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. కార్మికులను బేషరతుగా తిరిగి విధుల్లో చేరడానికి అనుమతించడం లేదని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, ప్రయాణ వ్యయం పెరిగి ప్రజలపై భారం పడుతుందన్నారు. అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై వీలును బట్టి గురువారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్‌ హామీని నిలుపుకోలేకపోగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆర్టీసీ ప్రైవేటీకరణను రద్దు చేస్తుందని హామీ ఇచ్చారు. 

 

>
మరిన్ని వార్తలు