ఆర్టీసీ సమ్మె; సడలని పిడికిలి 

21 Oct, 2019 09:07 IST|Sakshi
హన్మకొండ వెళ్లే బస్సు వద్ద ప్రయాణికులు

 విధులకు దూరంగా ఆర్టీసీ కార్మికులు

తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో రోడ్డెక్కిన బస్సులు 63

డిపో ఎదుట కార్మికుల నిరసనలు

సాక్షి, భూపాలపల్లి:  తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. కార్మికులందరూ విధులకు దూరంగా ఉండగా అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతోనే బస్సులను నడిపించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు బస్‌డిపో ఎదుట ధర్నా చేపట్టి నిరసన వెలిబుచ్చారు.  

63 బస్సులు..   
ఆర్టీసీ కార్మికులందరూ సమ్మెలో పాల్గొనడంతో అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో 63 బస్సులను నడిపించారు. 53 ఆర్టీసీ, ఏడు అద్దె బస్సులు, మూడు ప్రైవేట్‌ పాఠశాలల బస్సులను పరకాల, హన్మకొండ, గోదావరిఖని, మంచిర్యాల రూట్లతో పాటు పలు గ్రామాలకు నడిపించారు. అయితే శనివారం బంద్‌ సందర్భంగా ఎక్కువ మంది ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. దీంతో ఆదివారం బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపించింది. సెలవులు ముగియడంతో హాస్టళ్లు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఎక్కువగా కనిపించారు. అయితే బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రయాణికులు బస్టాండ్‌లో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సమ్మె సందర్భంగా భూపాలపల్లి డిపోలోని కార్మికులు డిపో ఎదుట ధర్నా నిర్వహించి తమ నిరసనను వెలిబుచ్చారు.  

నేటి నుంచి కార్యాచరణ...  
ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మెను మరింత బలోపేతం చేసేందుకు గాను రాష్ట్ర కమిటీ నేటి నుంచి కార్యాచరణ రూపొందించినట్లు భూపాలపల్లి డిపో జేఏసీ కన్వీనర్‌ బుర్రి తిరుపతి, కోకన్వీనర్‌ ఈ సమ్మిరెడ్డి తెలిపారు. నేడు(సోమవారం) ఆర్టీసీ కార్మికులందరూ కుటుంబ సభ్యులతో కలిసి డిపో ఎదుట ధర్నా, ఈ నెల 22న తాత్కాలిక డ్రైవర్, కండక్టర్‌లతో ములాఖత్, 23న ప్రజాప్రతినిధులు, మంత్రులతో ములాఖత్, 24న మహిళా కండక్టర్లతో దీక్షలు, 25న హైవేలపై రాస్తారోకోలు, ధర్నాలు, 26న కార్మికుల పిల్లలతో దీక్షలు, 27న కార్మికుల కుటుంబ సభ్యులతో దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ఆయా కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని తిరుపతి, సమ్మిరెడ్డి కోరారు. 

మరిన్ని వార్తలు