భగ్గుమన్న ఆర్టీసీ కార్మికులు 

14 Nov, 2019 02:45 IST|Sakshi
మహబూబాబాద్‌ డిపో గేటు వద్ద నరేష్‌ మృతదేహంతో ధర్నా నిర్వహిస్తున్న నాయకులు

డిపోల ముట్టడికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు  

సాక్షి, హైదరాబాద్‌ : మహబూబాబాద్‌ డిపో ఆర్టీసీ డ్రైవర్‌ నరేశ్‌ ఆత్మహత్య నేపథ్యంలో కార్మికులు భగ్గుమన్నారు. సమ్మెలో భాగంగా 40వ రోజు నిరసనల్లో వారు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ముందు రోజూ నిరసనలు తెలుపుతున్న కార్మికులు, డ్రైవర్‌ ఆత్మహత్య నేపథ్యంలో డిపోల్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. కార్మికులు ఎంతమంది చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్‌ ఆత్మహత్య విషయం తెలియగానే పోలీసులు అన్ని డిపోల వద్ద భద్రతను పెంచారు. దీంతో డిపోల ముట్టడి కార్యక్రమాలు ఉద్రిక్తంగా మారాయి. జేఏసీ నేతలు, ఇతర జిల్లాలకు చెందిన కార్మిక సంఘాల నేతలు మహబూబాబాద్‌ వెళ్లి నరేశ్‌ మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. ప్రభుత్వం ఎంత మొండిగా వ్యవహరించినా, అంతిమ విజయం మాత్రం కార్మికులదేనని, ఎవరూ ఆందోళనకు గురికావద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని కార్మిక నేతలు కోరారు. 

మానసికంగా దెబ్బతీసేందుకే: ఆర్టీసీ జేఏసీ 
సమ్మెకు పరిష్కారం చూపే దిశగా హైకోర్టు ఎన్ని ప్రయత్నాలు చేస్తు న్నా ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని ఆర్టీసీ కార్మిక సం ఘాల జేఏసీ ఆరోపించింది. సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జీలతో కమి టీ వేసేందుకు సిద్ధమైనా, కావాలనే ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించిందని, తద్వారా సమస్య పరిష్కారం కాకుండా జాప్యం జరిగి కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతిని వారు మానసిక వేదనకు గురి కావాలనే చూస్తోందని జేఏసీ నేతలు రాజిరెడ్డి, థామస్‌రెడ్డిలు వ్యాఖ్యానించారు.

మరోసారి అఖిలపక్ష నేతలతో భేటీ
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మరోసారి అఖిలపక్ష నేతలతో భేటీ కావాలని భావిస్తోంది. కుదిరితే గురువారమే సమావేశమై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. 
72.67 శాతం బస్సులు తిప్పాం
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 72.67 శాతం బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. 1,934 అద్దె బస్సులు సహా 6,503 బస్సులు తిప్పినట్టు పేర్కొంది. 

మరిన్ని వార్తలు