ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ.. ఆశలన్నీ సీఎంపైనే

22 Nov, 2019 11:22 IST|Sakshi

డిపోల వద్ద పడిగాపులు కాస్తున్న కార్మికులు

సీఎం నిర్ణయం కోసం ఎదురుచూపులు

సాక్షి, హైదరాబాద్‌: కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమకు అనుకూలంగా సీఎం నిర్ణయం తీసుకుంటారా? లేక ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి ఉంటారా అనేది ఆసక్తికరంగా మరాంది. రెండు నెలలుగా వేతనాలు లేకుండా సమ్మెలో కొనసాగుతున్న కార్మికులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని జేఏసీ ప్రతిపాదించింది. దీంతో విధుల్లో చేరతామంటూ గురువారం రాష్ట్రంలోని వివిధ డిపోలకు కార్మికులు పెద్ద సంఖ్యలో  వచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి కూడా డిపోల వద్ద ఇదే పరిస్థితి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు.

అయితే, ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి తీసుకోవద్దని, విధుల్లో చేరేందుకు సిద్ధమంటూ లేఖలు ఇచ్చినా కూడా తీసుకోవద్దని డిపో మేనేజర్లకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి చేర్చుకోవడం సాధ్యం కాదని మేనేజర్లు వారికి చెప్పి పంపించేస్తున్నారు. మరోవైపు  ఆర్టీసిని నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలని, అంత శక్తి ప్రభుత్వ వద్ద లేదని సీఎం చేసిన వ్యాఖ్యలు కార్మికుల్లో కలవరం రేపుతున్నాయి. దీంతో వారి ఆశలన్నీ సీఎం తీసుకునే నిర్ణయంపైనే ఉన్నాయి. మరోవైపు ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తూ ఆర్టీసీ రూట్లను కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ కొనసాగనుంది. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

ఈ సందర్భంగా సమ్మె విరమణ ప్రతిపాదనపై చర్చించి తన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, సమ్మెకు సంబంధించిన అంశం కార్మిక న్యాయస్థానంలోనే తేల్చాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో, అది తేలిన తర్వాతే వారిని విధుల్లోకి చేర్చుకునే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని కార్మికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
 

మరిన్ని వార్తలు