ఆర్టీసీ చర్చలు : ‘మొబైల్‌ ఫోన్లు లాక్కున్నారు’

26 Oct, 2019 17:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ జేఏసీ నేతలతో యాజమాన్యం చర్చలు విఫలమయ్యాయి. ఎర్రమంజిల్‌లోని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. కోర్టు ఉత్తర్వులు అమలు చేశామని చెప్పడానికే చర్చలు పెట్టారని, సమస్యల పరిష్కారం కోసం కాదని జేఏసీ నేతలు ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ‘నిర్బంధంగా చర్చల ప్రక్రియ కొనసాగింది. మా మొబైల్‌ ఫోన్లు లాక్కున్నారు. కేవలం నలుగురిని మాత్రమే చర్చలకు ఆహ్వానించారు.

కోర్టు తీర్పును వక్రీకరించి 21 అంశాలపైననే చర్చిస్తామని యాజమన్యం స్పష్టం చేసింది. పూర్తి డిమాండ్లపై చర్చలు జరపాలని మేము పట్టుబట్టాం. 26 డిమాండ్లపై చర్చలు జరపాలని అన్నాం. యాజమాన్యం మా మాటల్ని పట్టించుకోలేదు. అందుకే బయటికి వచ్చేశాం. సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం. మా డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా వెళ్తాం’అన్నారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 22వ రోజుకు చేరింది.

>
మరిన్ని వార్తలు