కండక్టర్‌ అంత్యక్రియల్లో పోలీసుల అత్యుత్సాహం

3 Nov, 2019 15:46 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని ఆత్మకూరులో ఆర్టీసీ కండక్టర్ రవీందర్ అంతిమయాత్రలో గందరగోళం చోటుచేసుకుంది. అంతిమయాత్రను త్వరగా ముగించాలని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. కుటుంబ సభ్యులు, అంతిమయాత్రలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన పోలీసు కమిషనర్‌ మధు ఆర్టీసీ కార్మికులపై చేయి చేకున్నారు. పోలీసుల తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పోలీసులు తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతిమయాత్రను ఆపి.. రవీందర్‌ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. 

గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ కండక్టర్‌ రవీందర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు భారీ కాన్వాయ్‌తో రవీందర్‌ మృతదేహాన్ని ఆయన స్వస్థలం వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరుకు తరలించారు. రవీందర్‌కు భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవీందర్‌ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 29వ రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ ఆశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.
చదవండి: ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు