ఆర్టీసీ సమ్మె : 50 శాతం బస్సులు.. మరి ఆదాయమెక్కడ..!

21 Oct, 2019 15:06 IST|Sakshi

హైకోర్టుకు తెలిసిన అడ్వకేట్‌ జనరల్‌

విచారణ అక్టోబర్‌ 24కు వాయిదా

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపుపై రాష్ట్ర హైకోర్టులో సోమవారం వాదనలు జరిగాయి. డిమాండ్ల సాధనకు పిలుపునిస్తూ ఆర్టీసీ కార్మికులు అక్టోబర్‌ 5న సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసింది. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్‌ నెల వేతనాలను యాజమాన్యం చెల్లించలేదు. దీంతో వారు కోర్టులో పిటిషన్‌​ దాఖలు చేశారు. ఇక సోమవారం జరిగిన విచారణలో.. ఆర్టీసీ కార్పొరేషన్ వద్ద కేవలం రూ. 7.5 కోట్లే ఉన్నాయని అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల వేతనాలు చెల్లించాలంటే రూ.224 కోట్లు అవసరమవుతాయని కోర్టు దృష్టికి తెచ్చారు. 

అయితే, ‘సమ్మె కొనసాగుతున్నా.. 50 శాతం బస్సులను తిప్పుతున్నామని ప్రభుత్వం చెప్తోంది. మరి వచ్చిన ఆదాయమంతా ఎక్కిడికి పోయింది’అని కార్మికుల తరపు పటిషనర్‌ వాదించారు. తక్షణమే 48 వేల మంది ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్‌ నెల వేతనాలను ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 28న ఆర్టీసీపై డివిజన్ బెంచ్‌లో విచారణ అనంతరం వేతనాల చెల్లింపు పిటిషన్‌పై విచారణ చేపడతామమని వెల్లడించింది. తదుపరి విచారణ 29కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

ఇదిలాఉండగా..  గత బుధవారం ఇదే అంశంపై కోర్టులో విచారణ జరగగా.. సెప్టెంబర్‌ నెల వేతనాలు చెల్లించేందుకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. సోమవారం నాటికి జీతాలు చెల్లిస్తామని ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో జీతాలు ఇచ్చేందుకు సిబ్బంది లేరని కోర్టుకు విన్నవించింది. సోమవారం లోపు కార్మికులకు జీతాలు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు
ఆదేశాలు జారీచేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు