లేబర్‌ కోర్టుకు ఆర్టీసీ సమ్మె!

18 Nov, 2019 17:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మెపై సోమవారం తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు జారీ చేసింది. ఈ అంశాన్ని కార్మిక న్యాయస్థానం చూసుకుంటుందని హైకోర్టు తెలిపింది. రెండు వారాల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని కార్మిక శాఖ కమిషనర్‌కు సూచించింది. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె చట్టవిరుద్ధమని ఆదేశించలేమని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. సమ్మె లీగల్‌, ఇల్లీగల్‌ అని చెప్పే అధికారం లేబర్‌ కోర్టుకు మాత్రమే ఉంటుందని అభిప్రాయపడింది.  ప్రభుత్వంతో చర్చల కమిటీ వేయాలని ఆర్టీసీ జేఏసీ కోరగా.. కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా కమిటీ వేయాలని ఆర్టీసీ జేఏసీ కోరింది. 45 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ధర్మాసనానికి వివరించారు. జీతాలు లేక కుటుంబ పోషణ భారం అవుతుందన్నారు. ప్రభుత్వం మాత్రం తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపిస్తూ యాక్సిడెంట్లు చేయిస్తుందని హైకోర్టుకు వివరించారు. ఈ విషయం లేబర్‌ కోర్టు చూసుకుటుందని, తాము ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు అభిప్రాయపడింది.

సోమవారం ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ‘పిటిషినర్‌ కోరిన దాని ప్రకారం.. తమ ముందు రెండు అంశాలు మాత్రమే ఉన్నాయి. మొదటిది సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించడం. రెండోది కార్మికులను చర్చలకు పిలవమని ప్రభుత్వాన్ని ఆదేశించడం. సమ్మె చట్ట విరుద్ధమని చెప్పే అధికారం లేబర్‌ కోర్టుకు మాత్రమే ఉంటుంది. కార్మికులను చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కోర్టుకు ఉందో లేదో చెప్పమని మొదటి నుంచి అడుగుతున్నాం. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో బస్సులు లేకపోయినా మెట్రోలో ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’ అని పేర్కొంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా